Page Loader
అస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది 
వరదల్లో చిక్కుకున్న 31 వేలాది జనం

అస్సాంలో భారీ వర్షాలకు రెడ్ అలెర్ట్ .. వరదల్లో చిక్కుకున్న 31 వేల మంది 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 20, 2023
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలకు వ‌ర‌ద‌లు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 30 వేల మందికిపైగా జనం వ‌ర‌ద‌ల బారినపడ్డారు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అస్సాంకు రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో ప‌రిస్థితి దిగజారుతోంది. ఆయా జిల్లాల్లో దాదాపు 31 వేల మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

DETAILS

అస్సాం వరదనీటిలోనే వేలాది మంది జనం

అస్సాం ల‌ఖింపూర్ జిల్లాలో దాదాపుగా 22 వేల మంది ఇంకా వ‌ర‌ద నీటిలోనే బిక్కుబిక్కుమంటున్నారు. దిబ్రుఘ‌ర్ , కోక్రాజార్ జిల్లాల్లోనూ వేలాది మంది వ‌రద నీటితో నిరాశ్రయిలయ్యారు. 7 జిల్లాల్లో 25 వరద ఉపశమన కేంద్రాలను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. కొన్ని ప్ర‌దేశాల్లో అయితే కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. దిమా హ‌సావో, కామ‌రూప్ మెట్రోపాలిటిన్‌, క‌రీంగంజ్ ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు జారిప‌డ్డాయి. సోనిత్‌పూర్‌, న‌గావ్‌, నాల్బ‌రి, బాక్సా, చిరాంగ్‌, ద‌ర్రాంగ్‌, దేమాజి, గోల్‌పారా, గోలాఘాట్‌, కామ‌రూప్‌, కోక్రాజార్‌, ల‌ఖింపూర్‌, దిబ్రూగ‌ర్‌, క‌రీంగంజ్‌, ఉద‌ల్‌గిరి ప‌ట్ట‌ణాల్లో రోడ్లు కొట్టుకుపోయి, బ్రిడ్జ్‌లు కూలిపోయే పరిస్థితికొచ్చాయి. మరోవైపు వందలాది గ్రామాల్లో పూర్తిగా నీటమునిగాయి. వేలాది ఎకరాల్లోని పంట సైతం వర్షాల ధాటికి దెబ్బతింది.