LOADING...
IIT Roorkee: వరదలో చిక్కుకున్న ఐఐటీ రూర్కీ.. విద్యార్థుల వినూత్న ఆలోచన
వరదలో చిక్కుకున్న ఐఐటీ రూర్కీ.. విద్యార్థుల వినూత్న ఆలోచన

IIT Roorkee: వరదలో చిక్కుకున్న ఐఐటీ రూర్కీ.. విద్యార్థుల వినూత్న ఆలోచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ క్యాంపస్ జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో హాస్టళ్లు, విద్యా భవనాల మధ్య రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు తమ సమయస్ఫూర్తితో వినూత్న పరిష్కారాన్ని కనుగొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం ఐఐటీ రూర్కీ క్యాంపస్‌పైనా తీవ్రంగా కనిపించింది. క్యాంపస్‌లోని రహదారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో విద్యార్థులు, సిబ్బంది ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం కష్టంగా మారింది.

వివరాలు 

ప్రత్యేక ఆకర్షణగా వరద నీటిలో వారి ప్రయాణం

ఈ సమస్యను అధిగమించేందుకు విద్యార్థులు, సిబ్బంది కలిసి ప్లాస్టిక్, చెక్క బోర్డులను ఉపయోగించి తాత్కాలిక తెప్పను తయారు చేశారు. కొందరు ఆ తెప్పపై నిలబడి ప్రయాణిస్తుండగా, మరికొందరు పొడవాటి కర్రలతో నీటిని తోస్తూ తెప్పను ముందుకు తీసుకెళ్లారు. వరద నీటిలో వారి ప్రయాణం క్యాంపస్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి.

వివరాలు 

అందుబాటులో ఉన్న వనరులతో పరిష్కారం

పలువురు నెటిజన్లు ఆ వీడియోలకు ప్రముఖ 'టైటానిక్' సినిమాలోని ప్రసిద్ధ గీతాన్ని జోడించి సరదాగా షేర్ చేస్తున్నారు. మరోవైపు, క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, సృజనాత్మక ఆలోచనలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు, మెస్ సిబ్బంది వంటశాలకు చేరుకుని విద్యార్థులకు భోజనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉండటంతోనే ఈ తాత్కాలిక తెప్పను ఉపయోగించినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులతో పరిష్కారం కనుగొన్న తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement