Karnataka: కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హోటళ్లలో కుళ్లిన ఆహారం.. కేఎఫ్‌సీలో తనిఖీలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రభుత్వ ఆహార కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో గడువు ముగిసిన, నాణ్యత లేని ఆహార పదార్థాలు భారీగా బయటపడుతున్నాయి. నిబంధనలు పాటించని సంస్థలకు నోటీసులు జారీ చేయడంతోపాటు, సురక్షితం కాని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా శనివారం మైసూరు నగరం, జిల్లాలో ఆహార భద్రతా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రియో మెరిడియన్ హోటల్‌లో గడువు ముగిసిన 9 కిలోల చికెన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో నాలుగు హోటళ్లలో తనిఖీలు చేపట్టగా.. గ్రాండ్ మెర్క్యూర్ హోటల్‌లో 68కిలోల మాంసాన్ని, క్యూ స్టార్ హోటల్‌లో 4 కిలోల పుట్టగొడుగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
తన
మైసూరు, నంజనగూడు తాలూకాల్లోని మూడు రిసార్టుల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మూడు నోటీసులు జారీ చేశారు.
ఆహార నాణ్యతను పరీక్షించేందుకు ఐదు నమూనాలను సేకరించారు.
వీటిలో రెండు చట్టపరమైన నమూనాలు కాగా.. మూడు సర్వే నమూనాలు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా సుమారు 16 కిలోల గడువు ముగిసిన, త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలను పారవేశారు.
వివరాలు
కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లోనూ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో భాగంగా తీరప్రాంత కర్ణాటకలోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
మంగళూరులోని కేఎస్ రావు రోడ్డులో ఉన్న సిటీ సెంటర్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌పై వినియోగదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన చికెన్ పెరి పెరి లెగ్ రుచిలో తేడాగా ఉండటంతోపాటు పాడైపోయినట్లు అనిపించిందని, తినేందుకు అనువుగా లేదని వినియోగదారు ఫిర్యాదు చేశారు.
దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవుట్‌లెట్ వంటగది, నిల్వ గదులు, కోల్డ్ రూమ్‌లు, ఫ్రీజర్లు, వండిన ఆహార నిల్వలను పరిశీలించారు.
వివరాలు
వెయ్యి కిలోలకు పైగా నాసిరకం ఆహారం
బెంగళూరు, మైసూరు, మంగళూరు సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
మూడు, ఐదు నక్షత్రాల హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, ఫంగస్ పట్టిన పదార్థాలు, మాంసాన్ని సరిగా నిల్వ చేయకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
ఇటీవలి తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,000 కిలోలకు పైగా సురక్షితం కాని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రభుత్వ భవనాల్లోని క్యాంటీన్లపైనా చర్యలు
ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లకే తనిఖీలు పరిమితం కాలేదు. బెంగళూరులోని విధానసౌధ, వికాససౌధ, ఆరోగ్యసౌధ వంటి కీలక ప్రభుత్వ సముదాయాల్లో నిర్వహిస్తున్న ఆహార కేంద్రాలను కూడా అధికారులు తనిఖీ చేశారు.
కొన్ని చోట్ల అపరిశుభ్రమైన ఆహార నిర్వహణ, సరైన పురుగుల నియంత్రణ చర్యలు లేకపోవడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు.
క్విక్ కామర్స్ సంస్థల నిల్వ కేంద్రాలు, కమ్యూనిటీ ఫీడింగ్ కేంద్రాలు, కొన్ని ఇందిరా క్యాంటీన్లపైనా అధికారులు దృష్టి సారించారు.
పారిశుద్ధ్య లోపాలు గుర్తించిన కొన్ని కేంద్రాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు.. మరికొన్ని చోట్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు.
వివరాలు
నిబంధనలు పాటించాల్సిందే
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, సంబంధిత లైసెన్సింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే ఈ తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఆహార వ్యాపార నిర్వాహకులు సరైన ఉష్ణోగ్రత నియంత్రణ, పరిశుభ్రత ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
బెంగళూరు అర్బన్ జిల్లాలోనే ఇటీవల 60 మూడు, ఐదు నక్షత్రాల హోటళ్లలో తనిఖీలు నిర్వహించి.. 77 ఆహార నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం సేకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలును మరింత కఠినంగా పర్యవేక్షించేలా తనిఖీలు కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.