Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని భయంకరమైన ఘటనగా అభవిర్ణించింది. ఈ కేసును సీబీఐ, సిట్‌కు అప్పగిస్తే సరిపోదని అభిప్రాయపడింది. అంతేకాకుండా ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యంపై సుప్రీంకోర్టు పోలీసులను నిలదీసింది. జూలై 20న, మణిపూర్‌లో ఇద్దరు మహిళల వీడియో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు ఈ సమస్యను సుమోటోగా స్వీకరించింది. దీనికి తోడు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురైన మహిళలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మానసం ఈ కేసును విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఇది నిర్భయ లాంటి ఘటన కాదు: సీజేఐ
మణిపూర్ వైరల్ వీడియో ఘటనను స్వతంత్ర నేరంగా చూడలేమని, ఇది మూక హింసలో భాగమని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇది 'నిర్భయ' లాంటి ఘటన కాదని సీజేఐ అన్నారు. ఒక సమూహం ఇందులో పాల్గొన్నట్లు పేరొన్నారు. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జాతి ఘర్షణల కారణంగా 120 మందికి పైగా మరణించిన రాష్ట్రంలో 'హీలింగ్ టచ్' అనేది చాలా అవసరమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి 14 రోజులు ఎందుకు పట్టిందని రాష్ట్ర పోలీసులను సీజేఐ ప్రశ్నించారు. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏమి చేశారు? నిలదీశారు.
సమగ్ర నివేదికను కోరిన సీజేఐ
మణిపూర్‌లో నమోదైన 6000 ఎఫ్‌ఐఆర్‌లలో ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు? ఎన్ని జ్యూరిడిక్షనల్ మేజిస్ట్రేట్‌కు ఫార్వార్డ్ చేయబడ్డాయి? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాయి? లైంగిక హింసకు సంబంధించినవి ఎన్ని ? అందులో ఎన్ని కేసులకు న్యాయ సహాయం అందించబడ్డాయి? సీజేఐ ప్రశ్నించారు. రాష్ట్రంలో జాతి ఘర్షణ నేపథ్యంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి వాస్తవాలు రాష్ట్రం ప్రభుత్వం వద్ద లేకపోవడంపై సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ల వివరాలు, జాతి ఘర్షణలో నిర్వాసితులైన వారి దర్యాప్తు,పునరావాసం కోసం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సీజేఐ చంద్రచూడ్ మంగళవారానికి వాయిదా వేశారు.