Page Loader
రూ.20 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ట్రక్కు మాయం.. ఆందోళనలో వ్యాపారులు

రూ.20 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న ట్రక్కు మాయం.. ఆందోళనలో వ్యాపారులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 31, 2023
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో మరోసారి భారీ స్థాయిలో టామాటా దోపిడీ జరిగింది. ఈ మేరకు కోలార్ APMC యార్డ్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువైన టమాటాలతో బయల్దేరిన లారీ మాయమైపోయింది. ఈ క్రమంలోనే లారీ యజమాన్యం కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి సదరు ట్రక్కు జైపూర్ చేరుకోవాల్సి ఉంది. నిర్ణీత సమయానికి ట్రక్కు అక్కడకు చేరుకోలేదు. దీంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు డ్రైవర్ కు ఫోన్ చేసిన యజమానికి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణా యజమాన్యాన్ని సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి.టామాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భంగా SVT ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటాలతో నిండిన ట్రక్కు మిస్ అయ్యింది.

DETAILS

ట్రక్కు మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి మునిరెడ్డి

శనివారం రాత్రి సదరు లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టోల్ గేట్ దాటిందని డ్రైవర్, వ్యాపారి మునిరెడ్డికి సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం ట్రక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా, అందుబాటులో లేదని వచ్చింది. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ నుంచి ఎటువంటి సమాచారం అందట్లేదని మునిరెడ్డి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కోలార్ నుంచి దాదాపు 1,600 కి.మీ దూరం వెళ్లాక ట్రక్కు జాడ తెలియట్లేదు. లారీ ప్రమాదానికి గురైందా, లేక ఎవరైనా హైజాక్ చేసి సరుకు దొంగిలించారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. నెట్ వర్క్ సిగ్నల్ సరిగ్గా లేక ఫోన్ కలవట్లేదా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. లారీ మిస్సింగ్ పై వ్యాపారులు బోరుమంటున్నారు.