Loading...
Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం
వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం

Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకాలేదు. వరుసగా రెండో ఏడాది వీరిద్దరూ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్‌ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా, కేబినెట్‌ మంత్రి హోదా కలిగిన ఆయన.. ఎర్రకోటలో జరిగిన కార్యక్రమంలో రెండో చివరి వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది సంప్రదాయం, ప్రోటోకాల్‌కు భిన్నమని కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌ గాంధీకి ఆ సీటు కేటాయించడం ప్రజలను అవమానించడమేనని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించింది.

వివరాలు

గతంలో వివరణ ఇచ్చిన రక్షణ శాఖ

అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ శాఖ.. ఎర్రకోట ప్రాంగణంలో ఒలింపియన్లకు సీట్లు కల్పించాల్సి రావడంతో సీటింగ్‌ ఏర్పాట్లలో మార్పులు చేశామని వివరణ ఇచ్చింది.

ప్రోటోకాల్‌ ప్రకారం అధికారిక వేడుకల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉంటుంది.

తాజాగా ఖర్గే, రాహుల్‌ గాంధీ వరుసగా రెండో ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గైర్హాజరు కావడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ స్పందించారు. వారి గైర్హాజరు "దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు.

అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మరింత దిగజారాయి.

వివరాలు

పార్లమెంట్‌ సమావేశాల్లోనూ తీవ్ర విభేదాలు

ఉభయ పక్షాల మధ్య విభేదాల కారణంగా సమావేశాల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడింది.

తక్కువ ఉత్పాదకతకు ప్రతిపక్షమే కారణమని అధికార పక్షం, అధికార పక్షమే కారణమని ప్రతిపక్షం పరస్పరం ఆరోపించుకున్నాయి.

జులై 20న ప్రారంభమైన సమావేశాల సందర్భంగా విద్యార్థులు పార్లమెంట్‌ వైపు మార్చ్‌ చేయడంతో తొలిరోజే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందగా.. వాటిలో కేవలం పేపర్‌ లీక్‌లను నిరోధించే బిల్లుపైనే సుదీర్ఘ చర్చ జరిగింది.

సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సంప్రదాయ టీ పార్టీని కాంగ్రెస్‌ బహిష్కరించింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ టీ పార్టీకి హాజరుకాలేదు.

ADVERTISEMENT