Shatrucharla Vijayarama Raju: ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1948 ఆగస్టు 4న జన్మించిన విజయరామరాజు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. వైఎస్సార్ కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా, రోశయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు.
వివరాలు
లోక్‌సభ సభ్యుడిగానూ మూడుసార్లు ఎన్నిక
విజయరామరాజు 1978లో జనతా పార్టీ తరఫున రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఆ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1983 నుంచి 2009 మధ్య నాగూరు, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు.
లోక్‌సభ సభ్యుడిగానూ విజయరామరాజు మూడుసార్లు ఎన్నికయ్యారు.
1989లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1991లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 10వ లోక్‌సభలో రెండోసారి అడుగుపెట్టారు. అనంతరం 1998లో పార్వతీపురం నుంచే 12వ లోక్‌సభకు మూడోసారి ఎన్నికయ్యారు.
వివరాలు
2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా
తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన విజయరామరాజు.. 2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2023 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.