ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ ఇద్దరు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్ ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్‌ను నిలపాలని సీఎం కేసీఆర్ చేస్తున్న నేపథ్యంలో.. గమాంగ్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. గిరిధర్ గమాగ్ ఫిబ్రవరి 17, 1999 నుంచి డిసెంబరు 6, 1999 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, గమాంగ్ తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2015లో బీజేపీలో చేరారు.
ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలను సీఎం కలుస్తున్నారు. అందులో భాగంగానే ఒడిశా మాజీ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం. ఆయన బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మిగతా రాష్ట్రాల్లో అధ్యక్షులను నియమించే అంశంపై దృష్టి సారించారు. ఇదిలా ఉంటే.. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో భారీగా పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.