Loading...
Andhra Pradesh: టాప్‌-1,000 గ్లోబల్‌ సిటీల్లో మనవి 4.. ఏపీ నగరాలకు అరుదైన గుర్తింపు
టాప్‌-1,000 గ్లోబల్‌ సిటీల్లో మనవి 4.. ఏపీ నగరాలకు అరుదైన గుర్తింపు

Andhra Pradesh: టాప్‌-1,000 గ్లోబల్‌ సిటీల్లో మనవి 4.. ఏపీ నగరాలకు అరుదైన గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వేగవంతమైన ఆర్థిక పురోగతి సాధిస్తున్న 'ఎమర్జింగ్ స్టాండ్‌ఔట్స్‌' విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు నగరాలకు గుర్తింపు లభించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్థ తాజాగా 1,000అంతర్జాతీయ నగరాలతో 'గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026' నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులో నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన ప్రమాణాలు, పర్యావరణం, పాలన అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లను ప్రకటించారు. వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నగరాలతో పాటు జీడీపీ, ఉపాధి కల్పన, టెక్నాలజీ ప్రపంచ సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నగరాలకు ఈ విభాగంలో చోటు కల్పించారు.

వివరాలు

అంతర్జాతీయ టెక్‌హబ్‌గా బెంగళూరు

అంతర్జాతీయ నగరాల సూచీలో న్యూయార్క్‌ మొదటి స్థానంలో నిలవగా.. లండన్‌ రెండో స్థానం, పారిస్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.

భారత్‌ నుంచి దిల్లీ 268వ స్థానంలో, బెంగళూరు 311వ స్థానంలో, ముంబయి 330వ స్థానంలో, చెన్నై 381వ స్థానంలో, హైదరాబాద్‌ 421వ స్థానంలో ఉన్నాయి.

పుణె 427, త్రిసూర్‌ 477, కొచ్చి 489, కోల్‌కతా 496, కోజికోడ్‌ 499వ ర్యాంకుల్లో నిలిచాయి.

2050 నాటికి ఆర్థిక, వ్యాపార సేవల వృద్ధిలో భారతీయ నగరాలు ప్రపంచంలోనే ముందువరసలో నిలిచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. బెంగళూరు అంతర్జాతీయ టెక్‌హబ్‌గా నిలిచిందని తెలిపింది.

వివరాలు

విలువ ఆధారిత రంగాలపై దృష్టి పెడితేనే..

నగరాలు విలువ ఆధారిత రంగాలపై దృష్టి సారించినప్పుడే అధిక ఉత్పాదకతతో పాటు అధిక వేతనాలు అందించే ఉద్యోగాలు లభిస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ నివేదిక సూచించింది.

నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించడంతో పాటు స్థానికంగా విద్య, నైపుణ్యాలను ప్రోత్సహించడం ద్వారా మానవ వనరుల సంపదను పెంచుకోవచ్చని పేర్కొంది.

దీనివల్ల మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయవచ్చని వివరించింది.

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఆసియా నగరాలదే ఆధిపత్యమని నివేదిక వెల్లడించింది. భారీ జనాభా, ఉత్పాదకత, గణనీయంగా పెరిగిన ఆదాయ స్థాయులు భారత్‌, చైనాలను ముందంజలో నిలిపేందుకు దోహదం చేస్తున్నాయని తెలిపింది.

2050నాటికి ప్రపంచంలోని ప్రధాన గ్లోబల్‌ నగరాల మొత్తం జీడీపీలో చైనా, భారత్‌ వాటా.. యూరప్‌ వాటాను మించిపోతుందని నివేదిక అంచనా వేసింది.

ADVERTISEMENT