Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆయన ముంబై,న్యూఢిల్లీ నగరాల్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే మాక్రాన్,ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై అవగాహన పత్రాలను మార్పిడి చేయనున్నారు. అనంతరం సంయుక్త ప్రెస్‌మీట్ జరగనుండగా,తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరం, గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ అండ్ కల్చరల్ కమమెమొరేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో హారిజన్ 2047 రోడ్‌మ్యాప్ ప్రకారం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి.
వివరాలు
మాక్రోన్ నాలుగో భారత పర్యటన
ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రాంతీయ,గ్లోబల్ అంశాలపై కూడా నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. అలాగే 2026 అంతటా ఇరుదేశాల్లో జరగనున్న ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌ను ఇరు నేతలు సంయుక్తంగా ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మాక్రోన్ పాల్గొనడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. గతంలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన,బాస్టిల్ డే పరేడ్‌లో మోదీకి గౌరవ అతిథి హోదా,రిపబ్లిక్ డే వేడుకల్లో మాక్రోన్ ముఖ్య అతిథిగా పాల్గొనడం వంటి పరిణామాలు భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచాయి. ఇది మాక్రోన్ నాలుగో భారత పర్యటన కావడం విశేషం కాగా, కృత్రిమ మేధస్సు, కొత్త సాంకేతికతలపై ఇరుదేశాల మధ్య సహకారం మరింత విస్తరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ భారత్ పర్యటన ఇలా..
ఫిబ్రవరి 16, సోమవారం రాత్రి 11.50 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఫిబ్రవరి 17, మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ముంబైలోని లోక్ భవన్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఎంఓయూల మార్పిడి, ప్రెస్ ప్రకటన జరుగుతుంది. సాయంత్రం 5.20 గంటలకు తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరం, రాత్రి 7.15 గంటలకు గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఇన్నోవేషన్ అండ్ కల్చరల్ కమేమొరేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు.
వివరాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ భారత్ పర్యటన ఇలా..
ఫిబ్రవరి 18, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుని భారత్ మండపానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 19, గురువారం ఉదయం 9.40 గంటలకు భారత్ మండపంలోని ప్లీనరీ హాల్‌లో ఏఐ సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 10.40 గంటలకు దేశాల పావిలియన్లను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు లీడర్స్ ప్లీనరీ, వర్కింగ్ లంచ్‌లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు పారిస్‌కు తిరిగి బయలుదేరనున్నారు.