Telangana: కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. మంత్రి దామోదర తీరుపై పీసీసీ చీఫ్ అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల వ్యవహారశైలిపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి పార్టీ అధిష్ఠానానికి పంపాలని ఆయన భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వివరాలు
ఎమ్మెల్యేతో భేటీని రద్దు చేసిన మహేశ్
ఢిల్లీలో చోటుచేసుకున్న వివాదంపై వివరణ ఇవ్వాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావులను గాంధీ భవన్‌కు రావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.
గురువారం ఉదయం మంత్రితో, మధ్యాహ్నం ఎమ్మెల్యేతో వేర్వేరుగా సమావేశం కావాలని నిర్ణయించారు.
అయితే సమావేశానికి హాజరవుతానని ముందుగా అంగీకరించిన మంత్రి దామోదర రాజనర్సింహ చివరి నిమిషంలో రాలేనని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో పీసీసీ చీఫ్ అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకుని ఆయన వెనుదిరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
తన జిల్లాలో రాజకీయ జోక్యం చేసుకోవడంపై దామోదర రాజనర్సింహ అసంతృప్తి
ఈ వివాదానికి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామకమే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన స్వస్థలమైన నారాయణఖేడ్‌కు చెందిన ఓ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కేలా మద్దతు తెలిపినట్లు సమాచారం.
అయితే మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అయి ఉండి తన జిల్లాలో రాజకీయ జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ అంశమే ఇద్దరి మధ్య విభేదాలకు కారణమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
నేతల తీరుపై పీసీసీ చీఫ్ అసంతృప్తి.. అధిష్ఠానానికి నివేదిక పంపేందుకు సిద్ధం
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన 'చలో ఢిల్లీ' ర్యాలీ సందర్భంగా ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు ఎమ్మెల్యే వర్గం ఆరోపించింది.
ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొంది.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు చేసింది.
ఈ ఘటన అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
తాజాగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి హాజరుకాకపోవడంతో వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమగ్ర నివేదిక రూపొందించి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపనున్నట్లు సమాచారం.