LOADING...
Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం
అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం

Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజున గ్రామంలో అనుమానాస్పదంగా సంచరించిన ఓ కారుపై స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కారు ఇటీవల నర్సీపట్నం సమీపంలో జ్ఞానేశ్వరి బంధువును ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. చిన్నారి అదృశ్యమైన ఘటనపై పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గోడప్రతులను ముద్రించి వివిధ ప్రాంతాల్లో అతికిస్తూ ప్రజల నుంచి సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

వివరాలు 

ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అనుమానాస్పద కారు

ఈ నేపథ్యంలో జానుకు వరుసకు తాతయ్య అయ్యే కోటేశ్వరరావు మరో వ్యక్తితో కలిసి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం గోడప్రతులు అంటిస్తుండగా,మాకవారిపాలెం సమీపంలో ఓ కారు ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా,కారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందని కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజున గ్రామంలో ఓ కారు అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. తనను ఢీకొట్టిన కారు కూడా అదే వాహనమని కోటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. కోటేశ్వరరావును కారు ఢీకొట్టిన ప్రాంతంలోని సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి పరిశీలించే పనిలో ఉన్నారు.

వివరాలు 

కారు వ్యవహారంపై వివాదం

ఈ విషయంపై తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరరావును సంప్రదించగా, చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారును సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే గుర్తించామని తెలిపారు. గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి కొందరు అదే కారులో వచ్చారని, చిన్నారి అదృశ్య ఘటనతో ఆ వాహనానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జ్ఞానేశ్వరి తండ్రి గణేష్‌కు గతంలో ఓ కారు వ్యవహారంపై వివాదం తలెత్తినా, అనంతరం అది పరిష్కారమైందని సమాచారం. అయితే తాజాగా బంధువులు చేసిన ఆరోపణలతో ఆ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Advertisement