G20 summit in Delhi: జీ20 సమావేశాలకు సన్నాహాలు ప్రారంభం; అతిథుల కోసం 35 ఫైవ్‌స్టార్ హోటళ్లు బుకింగ్
ఈ వార్తాకథనం ఏంటి
జీ20 శిఖరాగ్ర సమావేశాలను సెప్టెంబరు 9,10 తేదీలలో దిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని అత్యాధునిక కన్వెన్షన్ కాంప్లెక్స్‌లో ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలను ప్రారంభించింది.
జీ20 సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ నాయకులు, అతిథులు కోసం విదేశాంగశాఖ దిల్లీలో ప్రపంచస్థాయిలో వసతులున్న 35హోటళ్లను బుక్ చేసింది.
తాజ్ మహల్, తాజ్ ప్యాలెస్, మౌర్య షెరటాన్, లే మెరిడియన్, షాంగ్రీ-లా, ఇంపీరియల్, ఒబెరాయ్, లీలా వంటి హోటళ్లు ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్న ఫైవ్ స్టార్ హోటళ్ల జాబితాలో ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్యలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేసే అవకాశం ఉంది.
దిల్లీ
దిల్లీలో 26 రహదారుల అభివృద్ధికి ప్రణాళిక
దిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విదేశాంగ శాఖ బుక్ చేసిన హోటళ్లు అతిథుల కోసం తమ వంటశాలలను బలోపేతం చేయడంలో బిజీగా ఉన్నాయి.
'అతిథి దేవో భవ' అనే జీ20 కాన్సెప్ట్‌కు అనుగుణంగా హోటళ్లను తీర్చిదిద్దే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
జీ20 సమావేశం జరగనున్న నేపథ్యంలో దిల్లీ నగరంలోని 26ప్రముఖ రహదారులను శుభ్రపరచడం, అభివృద్ధి చేయడం కోసం నేటి(ఆగస్టు 16) నుంచి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
దిల్లీ మున్సిపల్ అధికారులు గుర్తించిన 26రోడ్లలో మధుర రోడ్, భైరాన్ మార్గ్, సచివాలయ రోడ్, పురానా క్విలా రోడ్, లోధి రోడ్, మౌలానా మహ్మద్ అలీ జౌహర్ మార్గ్, సూరజ్ కుండ్ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ వంటి రోడ్లు ఉన్నాయి.