LOADING...
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?
బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?

West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఆ పార్టీకి చెందిన సుమారు 50మంది ఎమ్మెల్యేలు, 20మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం నుంచి అనుమతి లభిస్తే వారంతా కాషాయ కండువా కప్పుకునేందుకు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ఒకేసారి ఇంత పెద్దఎత్తున నేతలు పార్టీ మారితే తృణమూల్ కాంగ్రెస్ రాజకీయంగా తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. అయితే సౌమిత్ర ఖాన్ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ స్పందిస్తూ..ఇవన్నీ అసత్య ప్రచారాలని,ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

వివరాలు 

సువేందు అధికారి అధికారిక సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్

ఇదే సమయంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై కూడా సౌమిత్ర ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. తప్పులు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుందని అన్నారు. గతంలో బీజేపీ కార్యకర్తల ఇళ్ల కూల్చివేతల వెనుక ఉన్నవారు ఇప్పుడు దాని ఫలితాలు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బయటపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు, నేతల మధ్య విబేధాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. బారాసత్ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్ ఇటీవల ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

వివరాలు 

బెంగాల్‌లోని పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సామూహిక రాజీనామాలు

ఇటీవల ఆమెను లోక్‌సభలో పార్టీ ముఖ్య విప్ బాధ్యతల నుంచి తొలగించగా, అనంతరం బారాసత్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించడం కూడా రాజకీయ ఊహాగానాలకు బలం చేకూర్చింది. మరోవైపు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. దాదాపు వందమంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. భట్పరా మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ రేబా రాహాతో పాటు 30 మంది కౌన్సిలర్లు పదవులు వీడగా, హలిసహర్‌లో 16 మంది, కాంచ్రాపారలో 14 మంది కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించారు. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూడా తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Advertisement

వివరాలు 

సుజిత్ బోస్ అరెస్టు

ఇక మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ స్పందిస్తూ.. అవసరమైతే కౌన్సిలర్లు లేని మున్సిపాలిటీలకు ప్రత్యేక పరిపాలకులను నియమిస్తామని తెలిపారు. ఇదే సమయంలో మున్సిపల్ నియామకాల అవినీతి కేసులో మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్టు కావడం, పలువురు నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి కేంద్రీకరించడం తృణమూల్ కాంగ్రెస్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.

Advertisement