Zojila Tunnel Breakthrough: జోజిలా టన్నెల్‌లో చారిత్రాత్మక ఘట్టం.. బ్రేక్‌త్రూను ప్రారంభించిన గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌లో కీలక దశ అయిన 'జోజిలా టన్నెల్ బ్రేక్‌త్రూ' కార్యక్రమాన్ని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. హిమాలయ పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మితమవుతున్న ఈ టన్నెల్ ప్రాజెక్ట్‌లో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ఈ ప్రాజెక్ట్, భవిష్యత్ రవాణా వ్యవస్థకు కొత్త దారులు వేస్తుందని అధికారులు చెబుతున్నారు.
వివరాలు
ప్రయాణ సమయం భారీగా తగ్గింపు
శ్రీనగర్ నుంచి లడఖ్ వరకు ఉన్న జాతీయ రహదారి-1 (NH-1) మొత్తం పొడవు 421 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించాలంటే 13 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న హిమాలయ ప్రాంతాలను దాటాల్సి ఉండటంతో 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా బల్తాల్ నుంచి కార్గిల్ జిల్లాలోని మీన్‌మార్గ్ వరకు 40 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు నాలుగు గంటలు అవసరమవుతోంది. అయితే జోజిలా టన్నెల్ పూర్తయితే ఇదే దూరాన్ని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో లడఖ్‌కు రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.
వివరాలు
ప్రపంచంలోనే ప్రత్యేక టన్నెల్
13.153 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్‌గా గుర్తింపు పొందుతోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం కొనసాగుతోంది. ఈ టన్నెల్ పూర్తయితే ఏడాది పొడవునా లడఖ్ ప్రాంతానికి అన్ని కాలాల్లో రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మంచు కారణంగా రహదారులు మూసివేసే సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారనుంది.
వివరాలు
అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నిర్మాణంలో MEIL అత్యాధునిక న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) సాంకేతికతను వినియోగిస్తోంది. 2020 అక్టోబర్ 1న పనులు ప్రారంభం కాగా, అదే నెల 14న తొలి బ్లాస్టింగ్ నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
వివరాలు
మైనస్ 30 డిగ్రీల చలిలోనూ పనులు
జోజిలా టన్నెల్ నిర్మాణంలో సుమారు 1,500 మంది ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు పాల్గొంటున్నారు. హిమాలయ ప్రాంతంలో ఏడాదికి దాదాపు 100 రోజుల పాటు మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే తీవ్ర చలిలో కూడా పనులు కొనసాగించడం విశేషం. భారీ మంచు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు, క్లిష్ట భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొంటూ నిర్మాణ బృందం ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
వివరాలు
భద్రతలోనూ మరో రికార్డు
నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిన MEIL, 10 మిలియన్ సేఫ్ మాన్ అవర్స్ నమోదు చేసి మరో ఘనత సాధించింది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ దేశంలోనే అత్యంత క్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన జోజిలా టన్నెల్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. జోజిలా టన్నెల్ పూర్తయిన తర్వాత జమ్మూకశ్మీర్-లడఖ్ మధ్య రవాణా మరింత సులభతరం కావడంతో పాటు వ్యూహాత్మక, ఆర్థిక, పర్యాటక రంగాలకు కూడా కొత్త ఊపు రానుందని నిపుణులు భావిస్తున్నారు.