ISRO: అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న గగన్‌యాన్ వ్యోమగాములు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ఇస్రో విస్తృతంగా పలు పరీక్షలు చేపడుతోంది. ఈ క్రమంలో అంతరిక్ష యాత్రకు ఎంపికైన వ్యోమగాములను సమగ్రంగా సిద్ధం చేస్తోంది. ఈ మిషన్‌కు ఎంపికైన వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, అలాగే వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ప్రస్తుతం జీరో గ్రావిటీ పరిస్థితుల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
వారికి ప్రత్యేక శిక్షణ..
వ్యోమగామి శిక్షణ అనేది సాధారణ ప్రక్రియ కాదని, అది విస్తృత పరిజ్ఞానం, కఠిన సాధన, అనూహ్య అనుభవాలతో కూడిన సమగ్ర ప్రక్రియ అని శుక్లా తెలిపారు. ప్రతి రోజూ కొత్తగా ఏదో ఒక సవాలు ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్షంలో ఉండే పరిస్థితులను అనుకరించేలా మార్పులు చేసిన ఎయిర్‌బస్ A330, IL-76 వంటి విమానాల్లో వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ విమానాలను "వామిట్ కామెట్స్" అని కూడా పిలుస్తారు. గురుత్వాకర్షణ లేకుండా ఉండే భారరహిత వాతావరణంలో కదలడం, పనులు నిర్వహించడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
వివరాలు
సురక్షితంగా దిగేలా ఏర్పాట్లు..
2027లో చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వ్యోమగాములను సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని ఇస్రో ప్రణాళిక రూపొందించింది. ఈ యాత్ర సుమారు మూడు రోజుల పాటు కొనసాగనుంది. తిరుగు ప్రయాణంలో వారు సముద్రంపై సురక్షితంగా దిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.