us: యుఎస్ అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలు:ట్రంప్ చిత్రంతో బంగారు స్మారక నాణెం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించనున్న స్మారక నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రం ముద్రించే ప్రతిపాదన ఆసక్తి రేపుతోంది. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయనున్న ఈ నాణెంపై, ఓవల్ ఆఫీస్‌లోని ప్రసిద్ధ రెజల్యూట్ డెస్క్ వద్ద చేతులు ఉంచిన ట్రంప్ భంగిమను ముద్రించనున్నట్లు సమాచారం. చరిత్రలో రెండోసారి ఇదే అరుదైన సందర్భం జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రం నాణెంపై కనిపించడం అమెరికా చరిత్రలో అరుదైన విషయం. గతంలో 1926లో, అమెరికా స్వాతంత్ర్యానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన స్మారక నాణెంపై అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు అదే తరహాలో ట్రంప్ చిత్రం ముద్రించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
డిజైన్‌కు ఆమోదం… తుది నిర్ణయం ఇంకా మిగిలే ఉంది
'యూఎస్ కమిషన్ ఆన్ ఫైన్ ఆర్ట్స్' ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ స్మారక నాణెం డిజైన్‌కు ఆమోదం తెలిపింది. అయితే, తుది పరిమాణాలు ఖరారైన తర్వాతే ముద్రణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ మాట్లాడుతూ... "250వ వార్షికోత్సవం సందర్భంగా దేశ చరిత్రతో పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ నాణెాన్ని రూపొందిస్తున్నాం. ఈ నాణెంపై కనిపించేందుకు ట్రంప్‌ను మించిన వ్యక్తి లేరు" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
చట్టం ఏమంటోంది?
అమెరికా చట్టాల ప్రకారం, జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రం సాధారణ కరెన్సీపై ముద్రించరాదు. అయితే, ఈ స్మారక నాణెం చలామణిలో ఉండే కరెన్సీకి భిన్నంగా ఉండటంతో ఈ నియమం వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఇంకా, డిజైన్ ఎంపిక నుంచి ముద్రణ వరకు పూర్తి నిర్ణయాధికారం ట్రెజరీ సెక్రటరీకే ఉంటుందని వెల్లడించారు. రాజకీయ విమర్శలు ఇదిలా ఉండగా, ఈ ప్రతిపాదనపై డెమోక్రాటిక్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఓరెగన్ సెనేటర్ జెఫ్ మెర్క్‌లీ మాట్లాడుతూ... "రాజులు, నియంతలు మాత్రమే తమ చిత్రాలను నాణేలపై ముద్రించుకుంటారు. ప్రజాస్వామ్య నాయకులు కాదు" అని వ్యాఖ్యానించినట్లు 'వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది.