Ganesh Immersion: 25న గణేశ్ నిమజ్జనం వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గణేశ్ వేడుకల ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గణేశ్ వేడుకలకు సంబంధించి కొన్ని పాత, నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. పాత వీడియోలను కొత్తవిగా చూపిస్తూ, ఫేక్ వీడియోలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వివరాలు
వల్గర్ పాటలు, అసభ్యకరమైన డ్యాన్స్‌లపై ఫిర్యాదులు
గణేశ్ మండపాల వద్ద వల్గర్ పాటలు, అసభ్యకరమైన డ్యాన్స్‌లపై ఫిర్యాదులు అందుతున్నాయని సజ్జనార్ చెప్పారు.
నిమజ్జనం వేడుకల్లో డీజేలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో 20 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
ఇతర జిల్లాల్లో మరో 8,400 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ శోభాయాత్రలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈసారి గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను కూడా వినియోగిస్తున్నామని సీపీ తెలిపారు.
వివరాలు
నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలు
నిమజ్జనం, శోభాయాత్రను పరిశీలించేందుకు 24 డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించినట్లు సజ్జనార్ తెలిపారు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
నిమజ్జనం వేడుకల్లో చైన్ స్నాచింగ్, ఇతర చోరీలు జరగకుండా క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
మొత్తం 25 క్రైమ్ విభాగాల బృందాలు నిమజ్జనం విధుల్లో పాల్గొంటాయని చెప్పారు.
మహిళలపై వేధింపులను అరికట్టేందుకు షీటీమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని సీపీ వెల్లడించారు.
వివరాలు
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని సజ్జనార్ తెలిపారు.
ఈనెల 25న నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు చెప్పారు.
అదే రోజు ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటు ట్రక్కులను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
నిమజ్జనం, శోభాయాత్ర సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.