Loading...
GATE 2027: గేట్‌ 2027కు డిజిలాకర్‌ తప్పనిసరి.. ఐఐటీ మద్రాస్‌ కీలక సూచనలు
గేట్‌ 2027కు డిజిలాకర్‌ తప్పనిసరి.. ఐఐటీ మద్రాస్‌ కీలక సూచనలు

GATE 2027: గేట్‌ 2027కు డిజిలాకర్‌ తప్పనిసరి.. ఐఐటీ మద్రాస్‌ కీలక సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(GATE 2027)పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఐఐటీ మద్రాస్‌ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 14 నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో పాల్గొనాలంటే డిజిలాకర్‌ ఖాతాను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తు ప్రారంభానికి ముందే తమ డిజిలాకర్‌ ఖాతాను సృష్టించుకోవడం లేదా ఇప్పటికే ఉంటే తాజా వివరాలతో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో డిజిలాకర్‌ను లింక్‌ చేసిన తర్వాత అభ్యర్థి అనుమతితో ధృవీకరించిన వ్యక్తిగత వివరాలను పోర్టల్‌ నేరుగా సేకరిస్తుంది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్‌ ఫొటో, ధృవీకరించిన గుర్తింపు పత్రం నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామా, మొబైల్‌ నంబర్‌, నివాస చిరునామా వంటి వివరాలు ఆటోమేటిక్‌గా పొందుపరచబడతాయి.

వివరాలు 

దరఖాస్తులు, పరీక్షల షెడ్యూల్‌ ఇదే

దీంతో దరఖాస్తు ప్రక్రియ వేగంగా పూర్తవడమే కాకుండా, వివరాల్లో పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా తగ్గుతాయని ఐఐటీ మద్రాస్‌ వెల్లడించింది.

గేట్‌ 2027 దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 14 నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుంది.

నిర్ణీత గడువు తర్వాత ఆలస్య రుసుముతో సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది.

వివరాలు 

డిజిలాకర్‌ అంటే ఏమిటి?

డిజిలాకర్‌ అనేది కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ నిల్వ వేదిక. విద్యా సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరచడం, అవసరమైనప్పుడు వాటిని సురక్షితంగా పంచుకోవడం, ధృవీకరించుకోవడం కోసం దీనిని రూపొందించారు.

మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ సేవలో ఎవరైనా ఖాతా తెరిచి తమ డాక్యుమెంట్లను భద్రపరచుకోవచ్చు.

మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో నమోదు చేసుకున్న తర్వాత వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) ద్వారా ఖాతాను ధృవీకరించి ప్రత్యేక డిజిలాకర్‌ ఐడీని సృష్టించుకోవచ్చు.

ADVERTISEMENT