India-Germany: నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల కోసం జర్మనీ వీసాలు.. 20వేలు నుండి 90వేలుకు పెంపు.. ప్రధాని మోదీ
నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి అందించే వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్‌లో ప్రధాని మాట్లాడుతూ, రాబోయే 25 సంవత్సరాల్లో వికసిత్ భారత్ సాధనకు రోడ్‌మ్యాప్ రూపొందించామన్నారు. "ఫోకస్ ఆన్ ఇండియా" పేరుతో జర్మనీ క్యాబినెట్ ఒక పత్రం విడుదల చేయడం ఆనందకరమని మోదీ పేర్కొన్నారు.
భారతీయ శ్రామిక శక్తిపై జర్మనీ ఉంచిన విశ్వాసం అద్భుతం: మోదీ
"నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులకు వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించింది. భారతీయ శ్రామిక శక్తిపై జర్మనీ ఉంచిన విశ్వాసం అద్భుతం, ఇది ఆ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. భారత్ ఇప్పుడు ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా మారుతోంది" అని మోదీ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ భారత్‌లోకి వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సమావేశం నిర్వహించడం గొప్ప అంశం అని ఆయన వ్యాఖ్యానించారు.