Boarding Pass: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బోర్డింగ్ పాస్‌పై స్టాంపింగ్ రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్‌పోర్టుల్లో బోర్డింగ్ పాస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఫిజికల్ బోర్డింగ్ పాస్‌ను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే సరిపోతుంది. బోర్డింగ్ పాస్‌పై స్టాంపింగ్ చేసే విధానాన్ని కేంద్రం తొలగించింది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
వివరాలు
ఫిజికల్ బోర్డింగ్ పాస్ ఉంటే?
ప్రయాణికులు కావాలనుకుంటే ఫిజికల్ బోర్డింగ్ పాస్‌ను వెంట తీసుకెళ్లవచ్చు. అయితే ఇకపై దానిపై ఇమిగ్రేషన్ స్టాంప్ వేయరు. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం బోర్డింగ్ పాస్‌ను చూపించడం మాత్రమే అవసరం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఫిజికల్ బోర్డింగ్ పాస్‌ల సమర్పణ, వాటిపై స్టాంపింగ్ విషయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ (BOI) కేంద్రానికి తెలిపింది.
కొన్ని సందర్భాల్లో స్టాంపింగ్‌లో జరిగే పొరపాట్ల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
దీంతో ఈ విధానాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
వివరాలు
సెక్యూరిటీ చెక్‌లో స్టాంపింగ్ ఉండదు
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల వ్యక్తిగత తనిఖీల సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కూడా బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేయడం లేదని అధికారులు తెలిపారు.
ఇమిగ్రేషన్ అధికారులు క్లియరెన్స్ కోసం బోర్డింగ్ పాస్‌ను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
భారత పాస్‌పోర్ట్ ఉన్నవారికీ వర్తింపు
భారత పాస్‌పోర్ట్ కలిగిన ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌లపై స్టాంపింగ్ తొలగింపునకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
డిజిటల్ విధానాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.