Amaravati: అమరావతికి గుడ్‌న్యూస్.. రాజధాని మీదుగానే దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు!
ఈ వార్తాకథనం ఏంటి
బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ రాజధాని అమరావతి మీదుగానే వెళ్లనుంది. అమరావతికి సమీపంలోని రావెల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదితంగా ఉండటంతో, దానికి ఆనుకొని హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం సూచించారు. ఈ నేపథ్యంలో ఫైనల్ లొకేషన్ సర్వే, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీకి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) సిద్ధమైంది.
వివరాలు
అమరావతి మీదుగా కారిడార్ వెళ్లేలా ఫ్లాన్
అయితే విమానాశ్రయానికి ఆనుకొని ఎలైన్‌మెంట్ ఖరారు చేస్తే కారిడార్ రాజధాని అమరావతి నగరానికి, విజయవాడకు దూరమయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఆ పరిస్థితిలో విమానాశ్రయం ప్రాంతం నుంచి గుంటూరు వైపు మార్గం మళ్లించాల్సి వస్తుందని తేలింది. దీంతో రాజధాని నగరానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మొదట ప్రతిపాదించినట్టుగానే అమరావతి మీదుగా కారిడార్ వెళ్లేలా ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూచించింది.
వివరాలు
దాచేపల్లి వద్ద తొలి స్టేషన్
హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 760.09 కిలోమీటర్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఈ కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం 18 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 180.32 కిలోమీటర్ల మేర కారిడార్ ఉండగా, హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 518.54 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో దాచేపల్లి తొలి స్టేషన్‌గా ఉండనుంది. అనంతరం అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి విమానాశ్రయం వద్ద స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనుండగా, తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్/మింజూర్, చెన్నై సెంట్రల్ స్టేషన్లు ఇందులో భాగం కానున్నాయి.
వివరాలు
పలమనేరు సమీపంలో 11.8 కిలోమీటర్ల సొరంగం
చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌లో నాలుగు సొరంగ మార్గాలు నిర్మించనున్నారు. చెన్నై నగర పరిధిలోని సెంట్రల్ స్టేషన్ వద్ద 1.73 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంటుంది. బెంగళూరు ప్రాంతంలో రెండు చోట్ల కలిపి 14.79 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు నిర్మించనున్నారు. మధ్యలో చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా కారిడార్ వెళ్లనుండటంతో, పలమనేరు సమీపంలోని అటవీ ప్రాంతంలో 11.8 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించి దాని గుండా కారిడార్‌ను తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. చెన్నై-బెంగళూరు కారిడార్ మొత్తం 306 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇందులో తమిళనాడులో 133 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 72 కిలోమీటర్లు, కర్ణాటకలో 101 కిలోమీటర్లు ఉంటాయి.
వివరాలు
తిరుపతి-చిత్తూరు మధ్య అనుసంధాన కారిడార్
ఈ మార్గంలో చెన్నై సెంట్రల్, పూనమల్లె, పరందూరు, చిత్తూరు, కోలార్, కొడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బయప్పనహళ్లి ప్రాంతాల్లో మొత్తం 7 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్ తిరుపతి విమానాశ్రయం మీదుగా వెళ్తుండగా, చెన్నై-బెంగళూరు కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్తుంది. ఈ రెండు హైస్పీడ్ కారిడార్లను అనుసంధానించేందుకు తిరుపతి-చిత్తూరు మధ్య ప్రత్యేక హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని సీఎం చంద్రబాబు గతంలో సూచించారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారులు, ఆ మార్గానికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీపై దృష్టి సారించారు.
వివరాలు
హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో 15 స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 597 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 239 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 264 కిలోమీటర్లు, కర్ణాటకలో 94 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కారిడార్‌లో మొత్తం 15 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్/పెన్మిల, సోమశిల ప్రాంతాల్లో స్టేషన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం స్టేషన్లు నిర్మిస్తారు. కర్ణాటకలో అలిపురా, దేవనహళ్లి, కొడిహళ్లి ప్రాంతాలు స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు.