Work From Park: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సైబరాబాద్‌లో 'వర్క్ ఫ్రం పార్క్'.. జనవరి 1 నుంచి అందుబాటులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
రోజూ నాలుగు గోడల మధ్య కూర్చొని పనిచేయడం విసుగుగా ఉందా? వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ప్రతిరోజూ ఇంటి నుంచే పనిచేయలేకపోతున్నారా? ఇలాంటి వారికి సరికొత్త పని వాతావరణాన్ని అందించేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగులు ఇకపై పార్కుల్లో కూర్చొని కూడా తమ పనులు చేసుకునేలా 'వర్క్ ఫ్రం పార్క్' విధానాన్ని తీసుకొస్తోంది. ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైన ఈ సరికొత్త థీమ్‌ను సైబరాబాద్‌లోనూ అమలు చేసేందుకు సిద్ధమైంది.
వివరాలు
ఉద్యోగులు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉన్న సైబరాబాద్ పరిధిలో ఉద్యోగులు, వ్యాపారులు, అంకుర సంస్థలు నిర్వహిస్తున్న యువతకు ప్రశాంతమైన పని వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
సాధారణ కార్యాలయాల్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలను ఉద్యానవనాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహనాల రద్దీ, శబ్ద కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో పనిచేసుకునేలా పార్కులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు.
వివరాలు
మొదటి దశలో రెండు పార్కుల అభివృద్ధి
సైబరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 30 పార్కులను 'వర్క్ ఫ్రం పార్క్' విధానంలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగా తొలి దశలో రెండు ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. జనవరి 1 నాటికి ఈ పార్కులను ప్రారంభించనున్నట్లు సీఎంసీ కమిషనర్ జి. సృజన వెల్లడించారు.
దేశంలోనే పార్కులను ఈ తరహాలో అభివృద్ధి చేయడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు.
శనివారం మాదాపూర్‌లోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వివరాలు
ఇవీ 'వర్క్ ఫ్రం పార్క్'లో సౌకర్యాలు
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్‌బండ మాధవహిల్స్ కాలనీలో ఉన్న 1.5 ఎకరాల పార్కుతో పాటు కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మాదాపూర్‌లో ఉన్న ఎకరా విస్తీర్ణం కలిగిన ఉద్యానవనంలో పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ రెండు పార్కుల్లో ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఎత్తయిన చెట్లు, వాటి మధ్యలో ఆకట్టుకునేలా నిర్మించే గదులు, సౌకర్యవంతమైన కుర్చీలు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
ఉచిత వైఫై నుంచి స్టార్టప్ మీటింగ్ హాల్ వరకు
ఈ పార్కుల్లో ఉచిత వైఫై, కెఫెటేరియా, కో-వర్కింగ్ సీటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాకుండా యాంఫీథియేటర్, స్టార్టప్ థీమ్‌తో ప్రత్యేక మీటింగ్ హాల్, వాకింగ్ ట్రాక్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారుల కోసం ఛార్జింగ్ సదుపాయం కల్పించనున్నారు. వీటితో పాటు శౌచాలయాలు, ఇతర అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు
అర్ధరాత్రి వరకు అందుబాటులో.. నామమాత్రపు రుసుము
పార్కులకు వచ్చే ఉద్యోగులు, ఇతర వినియోగదారుల భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నారు.
ఈ పార్కులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని కమిషనర్ జి. సృజన వెల్లడించారు.
నామమాత్రపు వినియోగ రుసుముతో వచ్చే ఏడాది నుంచి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ రెండు పార్కులకు వచ్చే స్పందనను పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి చేపడతామని ఆమె తెలిపారు.