Indian Air Force: 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ల్యాండింగ్.. భారత వాయుసేన సరికొత్త రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత వైమానిక దళం (Indian Air Force) విమానయాన చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. రష్యా తయారీ భారీ రవాణా విమానం 'ఐఎల్-76ఎండీ' (IL-76MD) లద్దాఖ్‌లోని అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరాల్లో ఒకటైన న్యోమాలో విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర మట్టానికి 13,629 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌బేస్‌లో విమానం దిగడం ప్రపంచ రికార్డుగా నిలిచిందని భారత వైమానిక దళం వెల్లడించింది. ప్రపంచంలో ఈ తరహా విమానం ఇంత ఎత్తులో ల్యాండ్ కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ అరుదైన ఘనత విమానం అసాధారణ సామర్థ్యానికి నిదర్శనమని వాయుసేన తెలిపింది. విమాన సిబ్బంది ప్రదర్శించిన అత్యుత్తమ నైపుణ్యాలు, కచ్చితత్వం కారణంగానే ఈ ల్యాండింగ్ విజయవంతమైందని వెల్లడించింది.
వివరాలు
చైనాకు సమీపంలో వ్యూహాత్మక వైమానిక స్థావరం
దేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రక ఘట్టంగా ఈ విజయాన్ని అభివర్ణించింది.
ఈ వివరాలను భారత వైమానిక దళం తన అధికారిక 'ఎక్స్' (X) ఖాతాలో వెల్లడించింది. లద్దాఖ్‌లోని న్యోమా వైమానిక స్థావరం భారత రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది.
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. గత ఏడాది నవంబర్‌లో ఈ వైమానిక స్థావరం అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ యుద్ధ విమానాలతో పాటు హెలికాప్టర్లను కూడా ల్యాండ్ చేసే సౌకర్యం ఉంది.
వివరాలు
ఎల్‌ఏసీ వెంబడి మౌలిక సదుపాయాల బలోపేతం
సరిహద్దు ప్రాంతాల్లో సైనిక అవసరాలను వేగంగా తీర్చేందుకు ఈ ఎయిర్‌బేస్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు సైనిక అవసరాలకు అనుగుణంగా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి రక్షణశాఖ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తోంది.
అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ (ALG) సహా దాదాపు అన్ని వైమానిక స్థావరాల్లో సౌకర్యాలను విస్తరిస్తోంది.
అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధాలు, ఇతర అవసరమైన సామగ్రిని వేగంగా తరలించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడనున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఎయిర్‌ఫీల్డ్‌గా పేరొందిన దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (DBO ALG)లోనూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.