Loading...
India Oil Refining Capacity: చమురు శుద్ధిలో భారత్‌ దూకుడు.. ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న ఆధిపత్యం!
చమురు శుద్ధిలో భారత్‌ దూకుడు.. ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న ఆధిపత్యం!

India Oil Refining Capacity: చమురు శుద్ధిలో భారత్‌ దూకుడు.. ప్రపంచ మార్కెట్‌లో పెరుగుతున్న ఆధిపత్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌.. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం అంతర్జాతీయంగా కీలక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్న సమయంలో భారతదేశం మాత్రం రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకుంటోంది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారత్‌కు వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తోందని 'ఇండియా నెరేటివ్‌' తన కథనంలో విశ్లేషించింది.

వివరాలు

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనింగ్‌ సామర్థ్యం భారత్‌దే!

2026 ఏప్రిల్‌ నాటికి భారత్‌ చమురు శుద్ధి సామర్థ్యం ఏడాదికి 267.1 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఇది రోజుకు సుమారు 53 నుంచి 56 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధికి సమానం.

ఈ సామర్థ్యంతో ప్రపంచంలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, రష్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2030 నాటికి ఏడాదికి 300 మిలియన్‌ టన్నుల చమురు శుద్ధి చేసే స్థాయికి చేరుకోవాలని భావిస్తోంది.

దీర్ఘకాలంలో ఈ సామర్థ్యాన్ని 400 మిలియన్‌ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో భారత్‌ పాత్ర మరింత కీలకం కానుంది.

వివరాలు

రష్యా నుంచి రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి

భారత్‌ తన అవసరాల కోసం రోజుకు సుమారు 54 నుంచి 56 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.

ఇందులో రష్యా నుంచి వచ్చే చమురు వాటా ఇటీవల రోజుకు 18 నుంచి 20 లక్షల బ్యారెళ్లుగా ఉంది. అంటే మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 35 శాతం.

గతంలో కొన్ని సందర్భాల్లో రష్యా చమురు వాటా భారత మొత్తం దిగుమతుల్లో 50 శాతాన్ని కూడా దాటింది.

అయితే ప్రస్తుతం ధరల ఆధారంగా భారత్‌ తన చమురు కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటోందని 'ఇండియా నెరేటివ్‌' కథనం పేర్కొంది

ADVERTISEMENT

వివరాలు

పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులతో భారీ ఆదాయం

ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. దేశంలోని రిఫైనరీల్లో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌ పెద్దఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఈ ఎగుమతుల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల విలువ 27.2 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇందులో డీజిల్‌ ఎగుమతుల వాటా 12.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2026 సెప్టెంబర్‌లో భారత్‌ రోజుకు సుమారు 6.2 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు సగం ఐరోపా దేశాలకే చేరింది.

ADVERTISEMENT

వివరాలు

కొన్ని ఆంక్షల విషయంలో మినహాయింపులు

రష్యా నుంచి వచ్చే పెట్రోలియం ఉత్పత్తులపై పరిమితులు, ఐరోపాలో పలు రిఫైనరీల మూసివేత, మధ్యప్రాచ్య దేశాల్లో నిర్వహణ పనుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన కొరత ఏర్పడుతోంది. ఈ కొరతను భారత ఎగుమతులు కొంతవరకు భర్తీ చేస్తున్నాయి.

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా ఆంక్షలు, సుంకాల రూపంలో ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ.. భారత రిఫైనరీల్లో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు అంతర్జాతీయ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన సందర్భాల్లో అమెరికా కూడా కొన్ని ఆంక్షల విషయంలో మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని ఈ కథనం గుర్తుచేసింది.

వివరాలు

అమెరికా ఆంక్షల ఒత్తిడి ఉన్నా.. భారత్‌ రిఫైనరీలదే కీలక పాత్ర!

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో సరఫరా వ్యవస్థకు భారత్‌ రిఫైనరీలు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోందని విశ్లేషించింది.

భారత్‌ తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటే.. ప్రపంచ మార్కెట్‌లో ఇంధన సరఫరా, డిమాండ్‌ సమతుల్యతను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటుందని 'ఇండియా నెరేటివ్‌' కథనం పేర్కొంది.

ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోందని విశ్లేషించింది.

ADVERTISEMENT