Hyderabad: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మరో 54 ఏటీసీలు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునికీకరించి, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశలో కొత్తగా 54 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి దశలో 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో 54 ఏటీసీలకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఏటీసీల సంఖ్య 119కి చేరనుంది. అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఏటీసీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.
వివరాలు
ఏటీసీలలో అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే
కొత్తగా ఏర్పాటు కానున్న ఏటీసీలలో అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండనుంది.
దీంతో వ్యవసాయ ఆధారిత గ్రామీణ-పట్టణ (రూరల్-అర్బన్) ప్రాంతాల్లోని ఏటీసీల సంఖ్య 89కు పెరగనుంది.
వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న 28 జిల్లాల్లో తొలి దశలో 45 ఏటీసీలు ఏర్పాటు చేయగా, రెండో దశలో మరో 44 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఉన్న అన్ని ఏటీసీలు ప్రభుత్వ ఐటీఐల పరిధిలోనే పనిచేస్తున్నాయి.
వీటికి అవసరమైన స్థలాలు అందుబాటులో ఉండటంతో టాటా టెక్నాలజీస్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. రెండో దశలో ఏర్పాటు చేయనున్న 54 ఏటీసీల్లో 42 కేంద్రాలకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
వివరాలు
నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం
నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తోంది.
మరో ఏడు కేంద్రాలకు భూములు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని వివాదాలు ఉండటంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది.
మిగిలిన కేంద్రాల కోసం తగిన స్థలాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ కొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల నిర్మాణంతో రాష్ట్రంలో మరో 12,932 శిక్షణ సీట్లు అందుబాటులోకి రానుండటంతో, మరింత మంది విద్యార్థులకు ఆధునిక నైపుణ్య శిక్షణ పొందే అవకాశం కలగనుంది.