Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
ఈ వార్తాకథనం ఏంటి
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్‌ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దీంతో అవసరమైతే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. దక్షిణాదికి నష్టం ఉండదన్న కేంద్రం డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని వెల్లడించింది. లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుత 543 నుంచి పెరిగినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో స్పష్టం చేశారు.
వివరాలు
తమిళనాడులో మారిన విజయ్ వైఖరి?
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 129 లోక్‌సభ స్థానాలు కొత్తగా 195కు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మొత్తం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దాదాపు 24 శాతం స్థాయిలోనే కొనసాగుతుందని వివరించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడు సీఎం విజయ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ వాటా తగ్గకుండా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
వివరాలు
డీఎంకే వైఖరిపైనా ఆసక్తి
అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే అనే కోణంలో మాట్లాడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ మార్పుపై విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే, రాజకీయంగా ప్రశ్నలు సంధిస్తున్నాయి.
మరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాత్రం ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను, తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వివరాలు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఉత్కంఠ
ఈ పరిణామాల నేపథ్యంలో డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల వైఖరులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి.
అయినప్పటికీ పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు మార్గం సిద్ధం చేస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది.
వివరాలు
డీలిమిటేషన్‌పై ఢిల్లీలో ఉత్కంఠ
మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్‌సభ స్థానాల పెంపు.. ఈ నాలుగు అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోక్‌సభ స్థానాలు పెరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని అమిత్ షా చెబుతుండగా.. దక్షిణాది నేతలు మాత్రం స్థానాల సంఖ్య పెరగడంతో పాటు తమ రాజకీయ వాటా కూడా తగ్గకుండా ఉండేలా కేంద్రం హామీ ఇవ్వాలని కోరుతున్నారు.
మరి కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తుందా? ఒకవేళ సమావేశాలు జరిగితే డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొస్తుందా? అన్నదే ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.