Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
ఈ వార్తాకథనం ఏంటి
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్న వారికి ఒక్కో వ్యక్తికి నెలకు 7 కిలోల ఆహార ధాన్యాలు అందించేలా నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. అయితే, కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల ఆహార ధాన్యాల పరిమితిని యథావిధిగా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం జాతీయ ఆహార భద్రత చట్టం-2013లో సవరణలు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రతిపాదిత మార్పులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు జూలై 13 వరకు సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనుంది.
వివరాలు
ఇద్దరికి 14 కిలోల ఆహార ధాన్యాలు..
ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కింద అతి పేద కుటుంబాలకు కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తున్నారు. మరోవైపు, సాధారణ రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానం అమల్లోకి వస్తే అంత్యోదయ కార్డు కలిగిన కుటుంబాలకు సభ్యుల సంఖ్య ఆధారంగా ధాన్యాల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు, కుటుంబంలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉంటే వారికి మొత్తం 14 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి.
వివరాలు
ప్రతి లబ్ధిదారికి తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు..
అదే ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు గరిష్ఠంగా 35 కిలోల వరకు ధాన్యాలు అందుతాయి. జాతీయ ఆహార భద్రత చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి లబ్ధిదారికి తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందేలా చేయడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.