New Airports: రాష్ట్రంలో మరో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 2.27 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ. 2.27 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ అభిప్రాయాలను ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలు కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
రహదారుల పనులపై అధికారులు రోజువారీ పర్యవేక్షణ
ఈ మేరకు, కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాలు, శ్రీకాకుళంలో 1,383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. మరోవైపు, రహదారుల మరమ్మతులపై స్పందిస్తూ, సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్ల నిర్మాణం లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. రహదారుల పనులపై అధికారులు రోజువారీగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ మేరకు, మంగళవారం సచివాలయం నుండి మంత్రి ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు 506 పనులు ప్రారంభమయ్యాయని, 563 కి.మీ.లో గుంతలు పూడ్చినట్లు అధికారులు తెలిపారు.