TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్-2 పరీక్షలు, 1,368 కేంద్రాల్లో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని 783 గ్రూప్-2 సర్వీస్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16న పరీక్షలు నిర్వహించనున్నారు. టీజీపీఎస్సీ ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 1,368 పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం 29 డిసెంబర్ 2022న ప్రకటన విడుదల కాగా, 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొన్ని సాంకేతిక కారణాలతో పరీక్షలు వాయిదా పడినా, ఈసారి నిర్దిష్ట తేదీల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షలు మొత్తం నాలుగు పేపర్లుగా ఉంటాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు, మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
అరగంట ముందే గేట్లు క్లోజ్
పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్, ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్షకు వస్తున్న అభ్యర్థులు మంగళసూత్రం, కంకణాలు ధరించవచ్చు. పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ లాగిన్ కూడా తప్పనిసరి చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లను మూసివేస్తామని టీజీపీఎస్సీ తెలిపారు.