చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ. గుడివాడ టీడీపీ కార్యాలయం పైకి కొందరు దుండగులు దాడి చేశారు. పెట్రోల్ ప్యాకెట్లను కార్యాలయంపై విసిరారు. అనంతరం ఆఫీస్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు నిప్పు అంటుకోలేదు. అనంతరం కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఆలాగే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ గుడివాడ నియోజవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావును ఏకంగా చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ఖండించిన టీడీపీ శ్రేణులు
గుడివాడ టీడీపీ ఆఫీస్‌పై దాడితో పాటు రావి వెంకటేశ్వరరావును బెదిరించడాన్ని స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిచారు. ఇది మాజీ మంత్రి పనేనని ఆరోపిస్తున్నారు. సోమవారం వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా.. టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి అనుచరుడు ఒకరు రావి వెంకటేశ్వరరావుకు కాల్ చేశాడు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని బెదిరించడమే కాకుండా.. చంపెస్తామని బెదిరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. అనంతరం కొందరు ఆఫీస్ పైకి దూసుకొచ్చినట్లు టీడీపీ నాయకులు చెప్పారు. అయితే ఆ సమయంలో పోలీసుల అక్కడే ఉన్నా.. ఆ దుండగులను అడ్డుకోలేదని విమర్శించారు.