Jindal Steel: జిందాల్ స్టీల్‌కు గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్ రోడ్డు!
ఈ వార్తాకథనం ఏంటి
జిందాల్ స్టీల్ లిమిటెడ్ (Jindal Steel) కంపెనీ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్ స్లాగ్ రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్టీల్ తయారీ ప్రక్రియలో వెలువడే వ్యర్థాలను 'స్టీల్ స్లాగ్'గా పిలుస్తారు. ఈ వ్యర్థాన్ని ఉపయోగించి జిందాల్ స్టీల్.. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI)తో కలిసి ప్రత్యేక రహదారిని నిర్మించింది.
వివరాలు
2 లక్షల టన్నుల స్టీల్ స్లాగ్‌తో 1.85 కి.మీ రోడ్డు
జిందాల్ స్టీల్, CSIR-CRRI సంయుక్తంగా దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్**ను వినియోగించి 1.85 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించాయి.
ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్ స్లాగ్ రహదారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది.
సాధారణ రహదారులతో పోలిస్తే స్టీల్ స్లాగ్‌తో నిర్మించిన రహదారులు ఎక్కువ కాలం మన్నుతాయని శాస్త్రీయంగా తేలింది.
అంతేకాకుండా వీటి నిర్మాణంలో 30-40 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి.
వివరాలు
వ్యర్థాల నుంచి సంపద సృష్టించొచ్చు: నవీన్ జిందాల్
శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల కలయికతో దేశ నిర్మాణానికి అవసరమైన విలువైన వనరులను తయారు చేయవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిందాల్ స్టీల్ లిమిటెడ్ ఛైర్మన్ నవీన్ జిందాల్ తెలిపారు.
ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చని ఆయన అన్నారు. స్టీల్ స్లాగ్‌ను రోడ్డు నిర్మాణంలో విలువైన వనరుగా అభివర్ణించారు.