PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సదస్సును అవినీతిపరుల సమ్మేళనమంటూ ఘాటైన విమర్శలు చేశారు. వారికి కుటుంబం మాత్రమే ముఖ్యమని, దేశం తమకు ఏది కాదు అన్నట్లు ప్రతిపక్షాల నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. 2024లో ఎన్డీయేను తిరిగి తీసుకురావాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మోదీ అన్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు.
'సబ్కా సాత్, సబ్కా వికాస్' విధానంతో ముందుకెళ్తున్నాం: మోదీ
గత తొమ్మిదేళ్లలో తాము పాత ప్రభుత్వాల చేసిన తప్పిదాలను సరిదిద్దడమే కాకుండా, ప్రజలకు కొత్త సౌకర్యాలను అందించేందుకు కృషి చేసినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అంటే 'ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు' అని, అయితే ప్రతిపక్షాలకు అలా కాదన్నారు. 'కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు' అన్న విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే, అటు బెంగుళూరులో ప్రతిపక్షాలు తమ రెండో రోజు సమావేశాన్ని కొనసాగిస్తున్నాయి. రెండో రోజు సమావేశానికి 26పార్టీలు హాజరయ్యారు. ఇంకోవైపు దిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశం అవుతున్నాయి.