Loading...
CV Anand: ఆర్మీ ఆయుధాలు గుంత తీసి పాతిపెట్టిన హవల్దార్.. వివరాలు వెల్లడించిన డీజీపీ
ఆర్మీ ఆయుధాలు గుంత తీసి పాతిపెట్టిన హవల్దార్.. వివరాలు వెల్లడించిన డీజీపీ

CV Anand: ఆర్మీ ఆయుధాలు గుంత తీసి పాతిపెట్టిన హవల్దార్.. వివరాలు వెల్లడించిన డీజీపీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 31న మద్రాస్‌ రెజిమెంట్‌లోని బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌లో ఆయుధాలు చోరీకి గురయ్యాయి. పిస్టల్స్‌, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్‌ చోరీ అయినట్లు గుర్తించారు. దీంతో బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌లోకి ప్రవేశించే అనుమతి ఉన్నవారిపై అధికారులు దృష్టి సారించారు.

వివరాలు 

అనుమానితులుగా వినోద్‌కుమార్‌,బల్లి మధు

ఈ క్రమంలో ఆర్మ్స్‌ కోర్టు ఇన్‌ఛార్జ్‌ వినోద్‌కుమార్‌, ఆమ్యునేషన్స్‌ కోర్టు (ఆయుధాగారం) ఇన్‌ఛార్జ్‌ బల్లి మధులను అనుమానితులుగా విచారించారు.

అయితే, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదని డీజీపీ తెలిపారు.

ఆ తర్వాత గతంలో హవల్దార్లుగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్‌ రావు, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మల్లేశ్‌ అలియాస్‌ రాజును విచారణకు పిలిచారు.

మల్లేశ్‌ కదలికలకు సంబంధించి పోలీసుల వద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నించినప్పటికీ.. అతడు వాస్తవాలను వెల్లడించకుండా దాచిపెట్టినట్లు సీవీ ఆనంద్‌ చెప్పారు.

వివరాలు 

నేరం అంగీకరించిన హవల్దార్‌ మల్లేశ్

తొలుత విచారణకు రావాలని పిలిచినా మల్లేశ్‌ హాజరు కాలేదని తెలిపారు.

అంతేకాకుండా,అతడి ఫోన్‌ కాల్‌ లిస్ట్‌,వాట్సప్‌ చాటింగ్‌లు డిలీట్‌ అయినట్లు గుర్తించారు.

అనంతరం మల్లేశ్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో అతడి ముఖంలో భయం,చెమటలు కనిపించాయని డీజీపీ వివరించారు.

కేసు తీవ్రతను మల్లేశ్‌ భార్యకు అధికారులు వివరించారు. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో చివరకు మల్లేశ్‌ నిజాన్ని అంగీకరించినట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు.

చోరీ చేసిన ఆయుధాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లి.. అక్కడ గుంత తీసి పాతిపెట్టినట్లు మల్లేశ్‌ వెల్లడించాడు.

మల్లేశ్‌ ఇచ్చిన సమాచారంతో ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు.

దీంతో బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లయింది.

ADVERTISEMENT