Loading...
Delhi High Court: శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

Delhi High Court: శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారంతో వీడియోలు ప్రసారం కావడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వీడియోలను తొలగించాలంటూ శిర్డీ సాయిబాబా ట్రస్ట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ (జీఏసీ)ని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌లోని అంశానికి ఉన్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. సాయిబాబా ట్రస్ట్‌ ఫిర్యాదును త్వరితగతిన పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. అందులోని అంశాలను పరిశీలించిన అనంతరం సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని జీఏసీకి స్పష్టం చేసింది.

వివరాలు 

ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ట్రస్ట్‌ ఆరోపణ

తాను ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయో వివరించే నివేదికను తదుపరి విచారణ తేదీ అయిన ఈ నెల 19లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ సామాజిక, ఆన్‌లైన్‌ మాధ్యమ వేదికలైన గూగుల్‌, యూట్యూబ్‌లకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు శిర్డీ సాయిబాబా ట్రస్ట్‌ తెలిపింది.

అయినప్పటికీ అభ్యంతరకరంగా ఉన్న వీడియోలను తొలగించేందుకు ఆయా వేదికలు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ (జీఏసీ)ని కూడా ఆశ్రయించినట్లు ట్రస్ట్‌ దిల్లీ హైకోర్టుకు వివరించింది.

అయినా సాయిబాబాపై దుష్ప్రచారం, అసత్య ఆరోపణలతో రూపొందించిన వీడియోలు యూట్యూబ్‌లో ఇంకా అందుబాటులోనే ఉన్నాయని పేర్కొంది.

వివరాలు 

తక్షణమే వీడియోలు తొలగించాలని విజ్ఞప్తి

విద్వేషాన్ని ప్రేరేపించేలా, సామాజికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్న వీడియోలను వెంటనే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని శిర్డీ సాయిబాబా ట్రస్ట్‌ కోర్టును కోరింది.

కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖతో పాటు గూగుల్‌, యూట్యూబ్‌లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఆన్‌లైన్‌ వేదికల్లో ఇలాంటి కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకునేలా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా ట్రస్ట్‌ కోరింది.

ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న దిల్లీ హైకోర్టు.. ముందుగా జీఏసీ ట్రస్ట్‌ ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.

వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఆదేశాల అమలుపై ఈ నెల 19లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ADVERTISEMENT