రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్
దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో యూఏఈ రాజకుటుంబ సభ్యుడిగా నటిస్తూ మూడు నెలలకు పైగా అక్కడే ఉండి.. ఏకంగా రూ.23 లక్షలు బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు ఓ యువకుడు. అతడిని మహమ్మద్ షరీఫ్ వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ఆచూకీకోసం వెతుకున్నారు. గతేడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 20 వరకు అతడు హోటల్‌లో బస చేశాడు. యూఏఈలో ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి లాగే.. నకిలీ బిజినెస్ కార్డుతో లీలా ప్యాలెస్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అతను హోటల్‌లో దిగాక.. అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ ఫలాహ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వద్ద తాను అధికారికా పనిచేశానని షరీఫ్ హోటల్ సిబ్బందికి చెప్పాడు.
నకిలీ చెక్కు ఇచ్చి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు
నవంబర్ 20 వరకు ఆ హోటల్‌లో ఉన్న అతను ఆ తర్వాత రోజు చెల్లని చెక్కు ఇచ్చి కనిపించకుండా పారిపోయాడు. అతడు ఇచ్చిన చెక్కు నకిలీదని ఆ తర్వాత గుర్తించారు హోటల్ సిబ్బంది. అనంతరం మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బిల్లు చెల్లించకుండా పారిపోవడమే కాకుండా హోటల్ గదిలోని వెండి వస్తువులు, ఇతర వస్తువులను కూడా ఆ యువకుడు దొంగిలించాడని పోలీసులు తెలిపారు. లీలా ప్యాలెస్ హోటల్‌లో షరీఫ్ మొత్తం ఖర్చు దాదాపు రూ. 35 లక్షలు కాగా.. అతను హోటల్‌లో దిగే ముందు రూ. 11.5 లక్షలు చెల్లించాడు. మిగతా సొమ్మును చెల్లించకుండానే పారిపోయాడు.