వడగాలుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం; రేపు రాష్ట్రాల మంత్రులతో మాండవీయ సమావేశం
వడగాలుల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశించారు. దేశవ్యాప్తంగా వేడిగాలులు విజృంభించడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో, ఈ సమస్యను ఎదుర్కోవడానికి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి మాండవీయ మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వడగాలులు తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రలను బుధవారం సమావేశం ఏర్పాటు చేసినట్ల మాండవీయ తెలిపారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, హీట్‌వేవ్ సంఘటనలు సంభవించిన రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ బృందంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఐఎండీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఉంటారని చెప్పారు.
యూపీలోని ఒక్క బల్లియా జిల్లాలోనే వడదెబ్బతో 68 మంది మృతి!
విపత్తు నిర్వహణ అధికారులు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, జార్ఖండ్, బిహార్ వంటి తూర్పు రాష్ట్రాల మంత్రులతో తాను బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తానని మాండవీయ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విపరీతమైన వేడిగాలులు ప్రబలడం వల్ల అనేక మంది చనిపోయారు. యూపీలోని బల్లియా జిల్లాలోనే 68 మంది వడదెబ్బకు గురై మరణించినట్లు వార్త సంస్థలు చెబుతున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఈ ఎండల నుంచి ప్రజలకు రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, నివారణ చర్యలకు ఉపక్రమించింది.