Anantapur Rains: అకాల వర్షాలతో అనంతపురం అతలాకుతలం.. పొంగిన వాగులు,వంకలు.. భారీగా పంట నష్టం
అకాల వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపోయాయి. కనగానపల్లి మండలంలో అత్యధికంగా 19 సెం.మీ. వర్షం నమోదయింది. ఈ జిల్లాలో సగటున ఆరు సెం.మీ. వర్షపాతం నమోదైంది. కనగానపల్లి చెరువు కట్ట తెరువడంతో,ఆ నీరు పండమేరు వంకలోకి చేరి వరద పెరిగింది. దీనివల్ల అనంతపురం శివార్లలోని కళాకారుల కాలనీ, ఉప్పరపల్లి జగనన్న కాలనీ, పంగల్ రోడ్డులోని ఇళ్లు నీట మునిగాయి. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాలనీల్లో వరద చేరడంతో స్థానికులు కట్టుబట్టలతో బయటకు రావాల్సి వచ్చింది.
శ్రీసత్యసాయి జిల్లాలో 1,110 ఎకరాల్లో దెబ్బతిన్న సాధారణ పంటలు
200 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు మునిగిపోయాయి, నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి. ఇళ్లలో వరద చేరడంతో చాలామంది మిద్దెలపైకి ఎక్కి సాయానికి ఎదురుచూసారు. చెరువుల కింద సాగు చేసిన వరి పొలాలు వర్షాలకు నేలకొరగడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో పెనుకొండ, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలు, అలాగే అనంతపురం జిల్లాలో రాప్తాడు, అనంతపురం గ్రామీణ మండలాల్లో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అధికారులు శ్రీసత్యసాయి జిల్లాలో 1,110 ఎకరాల్లో సాధారణ పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.
జాతీయ రహదారి దిగ్బంధం
పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కనగానపల్లి, రామగిరి మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో చెరువులు ఉప్పొంగాయి. వెంకటగిరి పాళ్యం చెరువు మరువ ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలనుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదలో చిక్కుకుపోయిన రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఒక లారీ, కారు కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు క్రేన్ల సాయంతో పక్కన పెట్టి రాకపోకలను పునరుద్ధరించారు. కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు మరువ పారడంతో జాతీయ రహదారిపై వరద ప్రవహించింది, ఫలితంగా నాలుగు గంటలపాటు ట్రాఫిక్ నిలిచింది.
వంకను ఆక్రమించిన వైసీపీ నాయకుడు
అనంతపురం శివార్ల ఉప్పరపల్లి పంచాయతీలో జగనన్న కాలనీ ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో 400 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కాలనీ పండమేరు వంక ప్రవాహ మార్గానికి ఆనుకుని ఉంది. అప్పట్లో రక్షణ గోడ లేకుండా ఉన్న జగనన్న కాలనీ నిర్మించారు. ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా వందల మంది లబ్ధిదారులు వరదల్లో చిక్కుకుపోయారు. దీనికి తోడు కాలనీకి ఆనుకుని ఉన్న పండమేరు వంకను స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి ఆక్రమించారు. సెంటున్నర చొప్పున ప్లాట్లు వేసి రూ. లక్షన్నరకు అమ్మేశారు. పదుల సంఖ్యలో అమాయకులు స్థలాలు కొని ఇళ్లు నిర్మించారు. పండమేరు వంక వరద ముంచెత్తడంతో ఆ ఇళ్లు అన్నీ మునిగిపోయాయి.