Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాల బీభత్సం.. 44 వేల హెక్టార్లలో పంట నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం పంటలు, మౌలిక సదుపాయాలకు కలిపి రూ.1,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
వివరాలు
పంట నష్టంపై పక్కాగా లెక్కలు తీయాలి: మంత్రి అచ్చెన్నాయుడు
భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ, ఉద్యాన శాఖలు అందించిన ప్రాథమిక నివేదికలను అధికారులు మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 44,029హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,734హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 190 మండలాల్లోని 1,229గ్రామాల్లో సుమారు 71,796 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు.
ఇప్పటివరకు 19 మండలాల్లోని 45గ్రామాలకు చెందిన 726మంది రైతుల పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు.
ఉద్యాన పంటల విషయానికి వస్తే.. 14 జిల్లాల్లోని 89 మండలాల్లో 5,777 మంది రైతులకు చెందిన 1,734 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.
వివరాలు
పూర్తిస్థాయి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక
ఇందులో 445 హెక్టార్లలో నష్టాన్ని ఇప్పటికే అంచనా వేశారు. మిగిలిన ప్రాంతాల్లో నష్టాన్ని లెక్కించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రికి వివరించారు.
క్షేత్రస్థాయిలో నష్టపోయిన ప్రతి రైతు వివరాలను పక్కాగా నమోదు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
నష్ట అంచనాల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సమగ్రంగా వివరాలు సేకరించాలని సూచించారు.
పూర్తిస్థాయి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
వివరాలు
రోడ్ల పునరుద్ధరణకు రూ.1,498 కోట్లు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం 2,405 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
వీటిని పునరుద్ధరించేందుకు సుమారు రూ.1,498.30 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోగా, మరో 9 చోట్ల గండ్లు పడ్డాయని మంత్రి తెలిపారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు వెంటనే పూర్తి చేసినట్లు చెప్పారు.
వివరాలు
శాశ్వత మరమ్మతులకు రూ.1,336.83 కోట్లు
దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.162.09 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
శాశ్వత మరమ్మతులకు మరో రూ.1,336.83 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. త్వరలోనే దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.