Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త.. జూన్ 30 వరకు విస్తారంగా భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ 30 వరకు రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. రాబోయే వారం రోజుల పాటు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపారు.
వివరాలు
నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
వర్షాల ప్రభావంతో రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో నేడు (జూన్ 24) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 29, 30 తేదీల్లో ఈ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో ప్రారంభంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జూన్ 28 నుంచి 30 వరకు భారీ వర్షాలు విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు.
వివరాలు
తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
రాయలసీమ జిల్లాల్లో వర్షపాతం ప్రారంభంలో తక్కువగా ఉండే అవకాశమున్నప్పటికీ, వారం చివరి నాటికి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో నేడు (జూన్ 24) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండతో పాటు మొత్తం ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వారం చివరికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు కూడా వర్షాలు విస్తరించే అవకాశముందని వెల్లడించింది.