రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక
గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇళ్లు విడిచి బయటకు రాకూడదని హెచ్చరించింది. నగర వాసులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. సిటిలో సహాయక చర్యల కోసం డీఆర్ఎఫ్(DRF) సిబ్బంది రంగ ప్రవేశం చేసింది. హిమాయత్, ఉస్మాన్ సాగర్లకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు రిజర్వాయర్లలోనూ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. గండిపేట రిజర్వాయర్ గేట్లను సైతం ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు.
11 జిల్లాలకు రెడ్ అలెర్జ్,మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ క్రమంలో వాగులు వంకలు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్, మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. యాదాద్రి-భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ సహా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను సూచించింది. ఈ క్రమంలోనే అతి భారీగా వానలు పడనున్నట్లు పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. గత 24 గంటల్లో బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 7 గంటల వరకు వర్షాలు కుండపోతగా కురుస్తున్న కారణంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 616 మి.మీ మేర వర్షపాతం కురిసింది. 10కిపైగా ప్రదేశాల్లో 300 మి.మీ నుంచి 500 మిల్లిమీటర్ల వర్షం పడింది. 50కి పైగా ప్రాంతాల్లో 200 మిల్లిమీటర్ల మేర వానలు దంచికొట్టాయి.