Telangana Floods: వరదల్లో చిక్కుకున్న 80మంది పర్యాటకులు, రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది
తెలంగాణ ములుగు జిల్లాలోని వెంకటాపురం(నూగూరు) మండలం ముత్యాలధార జలపాతాల వద్ద గల్లంతైన 80 మంది పర్యాటకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున రక్షించారు. ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతాన్ని తిలకించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో తిరుగు ప్రయాణంలో బుధవారం రాత్రి వారు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో పర్యాటకులు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు ఫోన్ చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌష్ ఆలంను సంప్రదించారు.
నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దు: ఎస్పీ
పర్యాటకుల ఫోన్‌కు స్పందించిన ఆలం వెంటనే జిల్లా విపత్తు ప్రతిస్పందన దళం (డీఆఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మొత్తం 50 మంది సిబ్బంది పర్యాటకులను రక్షించేందుకు రంగంలోకి దిగారు. రాత్రంతా పర్యాటకుల కోసం వెతికి, చివరికి 80 మంది పర్యాటకులను గురువారం తెల్లవారుజామున గుర్తించి, అనంతరం వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే ఒక వ్యక్తికి వైద్య సాయం అవసరమైంది. రక్షించిన పర్యాటకులకు సహాయక సిబ్బంది ఆహారం, వైద్య సహాయం అందించారు. భారీ వర్షాల సమయంలో నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు.