Page Loader
నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ
నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ

నేడు హైదరాబాద్​లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 26, 2023
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్​లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి,చార్మినార్‌, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ అయ్యింది.ఈ ప్రాంతాల్లో గంటకు 10 నుంచి 14 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు, 3 నుంచి 5 సెం.మీ వర్షం నమోదు కావొచ్చని వివరించింది. ఒక దశలో 5 నుంచి 10 సెం.మీ వర్షం సైతం కురవొచ్చని అంచనా వేసింది.

details

భారీ వర్షాలకు సిటీలో ఇబ్బందలు తలెత్తే అవకాశం ఉంది : వాతావరణ కేంద్రం 

మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో రహదారులన్నీ జలమయం కానున్నాయి. వేగమైన గాలులతో చెట్లు నేలరాలే ప్రమాదం ఉంది. విద్యుత్ స్తంభాలు దెబ్బతిని సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఉంది.సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారానికి ఐదు జోన్ల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని అంచనా వేస్తూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.శుక్ర,శనివారాల్లో మోస్తరు వర్షం పడనున్నట్లు పేర్కొంది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ వర్షపాతం వచ్చే అవకాశముందని తెలిపింది. మంగళవారం నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసిందని, ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ, టోలిచౌకిలో 19.8 మిమీ వాన పడ్డట్లు రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ చెప్పుకొచ్చింది.