Hemant Soren: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం.. హాజరైన రాహుల్.. మమత.. కేజ్రీవాల్.. మల్లిఖార్జున్ ఖర్గే
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన జార్ఖండ్ రాష్ట్రం 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హేమంత్ సోరెన్ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి కింది ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
కార్యక్రమానికి ఇండియా కూటమి ప్రముఖ నాయకులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర నేతలంతా హాజరయ్యారు.. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. వీటిలో జేఎంఎం 34 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 21 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్)(ఎల్) రెండు, ఏజేఎస్యూపీ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్), జేఎల్కేఎం, జేడీయూ ఒక్కొక్క స్థానంలో విజయం సాధించారు.