నేటి నుంచి సర్కార్ బడి విద్యార్థులకు ఉచిత అల్పాహారం.. మెనూ వివరాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని బడి పిల్లలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది.
ఉదయం పూట విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలని భావించిన సర్కారు, ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనుంది.
దసరా కానుకగా రాష్ట్రంలోని 28 వేలకుపైగా బడులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఫలితంగా 23,05,801 (23 లక్షల) మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు స్కూల్ డ్రాపౌట్లను తగ్గించేందుకు ఈ స్కీమ్ దోహదం చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో నేడు లాంఛనంగా అల్పాహార పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతనిధులు ప్రారంభించనున్నారు.
details
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అల్పాహారం అందజేత
దసరా సెలవులు పూర్తయ్యాక మిగిలిన పాఠశాలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సబితా వివరించారు.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని వర్తింపజేయనున్నారు.
సోమవారం - ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మాతో చట్నీ
మంగళవారం- పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ రవ్వ, చట్నీ
బుధవారం- ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం- మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం- ఉగ్గాని లేదా పోహా లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం - పొంగల్ సాంబార్ లేదా వెజిటబుల్ పులావ్, రైతా(మజ్జిగా) లేదా ఆలూ కుర్మాతో అల్పాహారం అందించనున్నారు.
details
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ మధ్యాహ్నా భోజనంతో అదనంగా రూ.135 కోట్లు ఖర్చు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లను ఖర్చు చేస్తోంది.
మరోవైపు దేశంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో ఆహారం, సహా వారానికి మూడు గుడ్లను ఇస్తున్నారు. సన్న బియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం మరో రూ.120 కోట్లను అదనంగా ఖర్చు పెడుతోంది.
దేశవ్యాప్తంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా, తెలంగాణలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు అదనంగా రూ.135 కోట్లు ఖర్చు అవుతోంది.
ఐరన్, మైక్రో మినరల్స్ కోసం విద్యార్థులకు రూ.32 కోట్లతో రాగి జావను అందజేస్తున్నారు.