Loading...
Thammineni: రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ
రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ

Thammineni: రూ.4 కోట్ల భూమి కేసు.. తమ్మినేని సీతారాంకి హైకోర్టులో ఎదురుదెబ్బ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైకాపా నేత,మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం,ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్‌ చిరంజీవి నాగులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.4కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాల ఆధారంగా చిరంజీవి నాగు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారంటూ కట్టా జయకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణకల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసును కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు,అరెస్ట్‌పై మధ్యంతర రక్షణ ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. అరెస్ట్‌ భయం ఉంటే ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. అలాగే,బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3)ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది.

వివరాలు 

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "భూమి అసలు విలువ ఎంత? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారు? చెల్లింపు చెక్కు ద్వారా జరిగిందా? నగదు రూపంలో ఇచ్చారా? కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల ఆధారాలు సమర్పించి మీ నిజాయతీని నిరూపించాల్సిన బాధ్యత మీదే" అని పిటిషనర్లను ప్రశ్నించింది.

ఇరుపక్షాలు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వై. లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

ఫోర్జరీ ఆరోపణలు వర్తించవని పిటిషనర్ల వాదన

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సి. రఘు వాదనలు వినిపించారు.

శ్రీకాకుళం శివారు చాపురం పంచాయతీ పరిధిలోని భూమిని రజని అనే మహిళ నుంచి తమ్మినేని చిరంజీవి నాగు కొనుగోలు చేశారని తెలిపారు.

ఈ లావాదేవీ కోసం వివిధ దశల్లో రూ.37 లక్షలు చెల్లించామని, అందుకు రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ఆధారమని కోర్టుకు వివరించారు.

మరణ ధ్రువపత్రం, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాల సృష్టిలో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఫోర్జరీ సెక్షన్లు వర్తించవని వాదించారు.

మిగిలిన నేరాలు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవే కావడంతో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం పోలీసులకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఆదేశించాలని కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

కుట్రపూరితంగా వ్యవహరించారని పోలీసుల వాదన

పోలీసుల తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో పిటిషనర్లు ఇతరులతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

తప్పుడు ధ్రువపత్రాల తయారీలో కూడా వారి పాత్ర ఉందని ఆరోపించారు.

క్రిమినల్‌ అంశాన్ని సివిల్‌ వివాదంగా మలిచేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

కేసుకు రాజకీయ రంగు పులిమారని వ్యాఖ్య

విచారణ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రిజిస్టర్డ్‌ పత్రం చిరంజీవి నాగు పేరుపై ఉంటే, ఆయన తల్లిదండ్రులు వాణి, సీతారాంను నిందితులుగా ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.

అదే విధంగా అన్నదమ్ములు, బావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ కేసుకు రాజకీయ రంగు పులిమినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

దీనిపై స్పందించిన పీపీ, తమ్మినేని సీతారాం అప్పట్లో స్పీకర్‌గా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇతర నిందితులతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సబ్‌-రిజిస్ట్రార్‌ను ప్రభావితం చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వాదించారు.

ఈ వ్యవహారంలో పిటిషనర్ల పాత్ర ఉందని వారి కళాశాలలో పనిచేసే సిబ్బంది కూడా వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు.

వివరాలు 

ఫిర్యాదిదారునికీ హైకోర్టు ప్రశ్నలు

స్థలం ఆక్రమణకు గురైందని తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ముందుగా సివిల్‌ కోర్టును ఎందుకు ఆశ్రయించారని,రెండేళ్ల తర్వాత ఇప్పుడు క్రిమినల్‌ కేసు ఎందుకు నమోదు చేయించారని ఫిర్యాదిదారు కట్టా జయకిశోర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.

దీనిపై ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ,నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ జరిగిన విషయం అప్పట్లో తెలియలేదని తెలిపారు.

భూమి ఆక్రమణ అంశంపైనే తొలుత సివిల్‌ కోర్టులో దావా దాఖలు చేశామని వివరించారు.

వివరాలు 

ఫిర్యాదిదారునికీ హైకోర్టు ప్రశ్నలు

ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల తీరుపై కూడా ఘాటుగా స్పందించారు. "పోలీసులు కవులుగా మారుతున్నారు. వారు తలచుకుంటే ఏదైనా సృష్టించగలరు. ప్రభుత్వం మారిన తర్వాత వాంగ్మూలాలు మార్చి నిందితులకు క్లీన్‌చిట్‌ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరం. శాంతిభద్రతల నిర్వహణ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప, పోలీసుల ఇష్టానుసారం ఉండకూడదు" అని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT