Telangana High court : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే
గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంపై హైకోర్టు విచారించింది. ఈ మేరకు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఆ స్కీమ్ అమలుపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. గిరిజనేతరులకు ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తున్నారని ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్డ్ నిబంధనలు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నవంబరు 6కి వాయిదా పడింది.
ప్రతి లబ్దిదారుడి ఖాతాలో 3 దఫాలుగా రూ.3 లక్షల సాయం
కేవలం ఆరు రోజుల్లోనే గృహలక్ష్మి పథకానికి సంబంధించి రెండున్నర లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం మూడున్నర లక్షల మంది లబ్దిదారుల జాబితా ప్రభుత్వానికి అందాలన్నది ఉద్దేశం. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. 15 లక్షల దరఖాస్తులు, 11 లక్షలకు ఎలిజిబిలిటీ.. సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయంతో, ఇళ్లు నిర్మించుకునేలా గృహలక్ష్మి పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 3.57 లక్షల నివాసాలు, సీఎం కోటాలో మరో 43 వేల ఇళ్లకు వెరసి 4 లక్షల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందాలన్నది లక్ష్యం.