LOADING...
Hyderabad:హైదరాబాద్‌కు 3డీ డిజిటల్‌ ట్విన్‌ సిటీ… హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభం
హైదరాబాద్‌కు 3డీ డిజిటల్‌ ట్విన్‌ సిటీ… హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభం

Hyderabad:హైదరాబాద్‌కు 3డీ డిజిటల్‌ ట్విన్‌ సిటీ… హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్‌ ట్విన్‌ సిటీ రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును అమలు చేసే సంస్థ ఎంపిక కోసం త్వరలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధి వరకు విస్తరించిన సుమారు 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్‌ చేస్తూ ఈ డిజిటల్‌ ట్విన్‌ను రూపొందించాలనే ప్రణాళికను ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఖరారు చేసింది. డిజిటల్‌ ట్విన్‌ అంటే నగరానికి పూర్తిస్థాయి డిజిటల్‌ రూపం. దీన్ని త్రీడీ విధానంలో రూపొందించడం వల్ల నగరంలోని ప్రతి ప్రాంతాన్ని కళ్లముందే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే కోహిమా, కాన్పుర్‌,ముంబయి, కొచ్చి వంటి నగరాలు ఇలాంటి డిజిటల్‌ ట్విన్‌లను సిద్ధం చేసుకుని అవసరమైన సందర్భాల్లో వినియోగిస్తున్నాయి.

వివరాలు 

అత్యాధునిక 3డీ స్కానర్లు, డ్రోన్‌ల సహాయంతో చిత్రీకరణ 

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి పరిస్థితుల్లో వేగంగా స్పందించి సమస్యలను అదుపులోకి తీసుకురావడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అదే వరుసలో హైదరాబాద్‌ కూడా చేరేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మొత్తం నగరాన్ని కవర్‌ చేస్తూ డిజిటల్‌ ట్విన్‌ తయారీ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం అత్యాధునిక 3డీ స్కానర్లు, డ్రోన్‌ల సహాయంతో నగరాన్ని పూర్తిగా చిత్రీకరిస్తారు. రెవెన్యూ, జలమండలి, విద్యుత్తు తదితర శాఖలకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా సేకరిస్తారు. ఈ సమాచారాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేసి, నగరానికి ఒక ప్రత్యక్ష డిజిటల్‌ నమూనాను రూపొందిస్తారు.

వివరాలు 

ట్రాఫిక్‌ జామ్‌లు నుంచి వరద ముప్పు వరకు ప్రత్యామ్నాయ మార్గాలు

ట్రాఫిక్‌ జామ్‌లు నుంచి వరద ముప్పు వరకు ఏ సమస్య ఎదురైనా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి అన్నదాన్ని కూడా ఈ డిజిటల్‌ నగరంలో ఊహాత్మక వీడియోల రూపంలో చూపించనున్నారు. దీని ద్వారా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం మరింత సులభమవుతుందని, భవిష్యత్‌లో పక్కా నగర ప్రణాళిక రూపకల్పనకు ఇది కీలకంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement