Loading...
HMDA: బంజారాహిల్స్‌-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌కు టెండర్లు
బంజారాహిల్స్‌-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌కు టెండర్లు

HMDA: బంజారాహిల్స్‌-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌కు టెండర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యంత రద్దీ మార్గంలో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు ప్రతిపాదించిన ఈ భారీ కారిడార్‌కు హెచ్‌ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా బిడ్లను స్వీకరించనుంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నిత్యం ట్రాఫిక్‌ రద్దీతో ఇబ్బందులు పడుతున్న బంజారాహిల్స్‌, ఐటీ కారిడార్‌ ప్రాంతాల ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి గచ్చిబౌలి సమీపంలోని శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు.

వివరాలు 

రెండు దశల్లో నిర్మాణం

పశ్చిమ హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే కీలక కూడళ్ల మీదుగా ఈ కారిడార్‌ వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.

రూ.1,656 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో ప్రాజెక్టును చేపట్టనున్నారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేసేలా అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేశారు.

మొదటి దశలో ఫిలింనగర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు 5 కిలోమీటర్ల మేర కారిడార్‌ నిర్మిస్తారు.

రెండో దశలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి హకీంపేట్‌ కుంట వరకు 4 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు.

వివరాలు 

రద్దీ ప్రాంతాల్లో ఎంట్రీలు,ఎగ్జిట్లు

కారిడార్‌పై వాహనాల రాకపోకలు సులభంగా సాగేందుకు ఆరు కీలక ప్రాంతాల్లో ర్యాంపులను ఏర్పాటు చేయనున్నారు.

ఫిలింనగర్‌ (రోడ్డు నంబరు 82), నార్నే రోడ్‌, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 52, ఐటీసీ కోహినూర్‌ రోడ్‌, టీ-హబ్‌ జంక్షన్‌, మైండ్‌స్పేస్‌ ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంపులు రానున్నాయి.

భవిష్యత్తులో ఈ మార్గంలో మెట్రో రైలు విస్తరణ చేపట్టే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కారిడార్‌ డిజైన్‌ను రూపొందించారు.

అవసరమైనప్పుడు మెట్రో రైలు మార్గాన్ని కూడా అభివృద్ధి చేసుకునేలా నిర్మాణాన్ని ప్రణాళిక చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌కు ఊరట

ఎలివేటెడ్‌ కారిడార్‌ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి తగ్గనుంది.

నగరంలోని ప్రధాన ప్రాంతం నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అనుసంధానమయ్యే మరో కీలక రేడియల్‌ రోడ్డుగా ఈ మార్గం ఉపయోగపడనుంది.

కారిడార్‌ ద్వారా ఔటర్‌ రింగ్‌రోడ్డుతో నేరుగా, ఎలాంటి ప్రధాన ఆటంకాలు లేకుండా అనుసంధానం ఏర్పడుతుంది.

బంజారాహిల్స్‌ నుంచి గచ్చిబౌలిలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు సిగ్నల్‌ ఫ్రీగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్‌ సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభించనుంది.

ADVERTISEMENT