Loading...
Chandrababu: హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu: హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తమకు నచ్చిన వారికి పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇచ్చుకునేందుకు అమలు చేసిన ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన ఆదేశించారు. రేషన్‌, పింఛను, ఇళ్ల కోసం కుటుంబ సభ్యులు విడిపోయి ప్రత్యేక కుటుంబాలుగా చూపించుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలే ఇలా కుటుంబాలను విభజించేలా, చిన్న కుటుంబాలను ప్రోత్సహించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలను కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అమలు చేయాలని సూచించారు.

వివరాలు

మ్యాపింగ్ పూర్తి చేయాలి

కొత్త పింఛన్లను మంజూరు చేసే ముందే కుటుంబాల మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

కుటుంబాల ఆర్థిక స్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని మ్యాపింగ్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.

అయితే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు శుక్రవారం సూపర్‌సిక్స్‌ పథకాలు, సంక్షేమ శాఖలపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వివరాలు

పీ4ను ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

ప్రతి నెలా 1వ తేదీని సంక్షేమ దినంగా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. అదే రోజు ఉదయం 'పేదల సేవలో' కార్యక్రమం కింద పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు.

సాయంత్రం ప్రతి గ్రామంలో సమావేశం నిర్వహించి.. ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని వివరించాలని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని కుటుంబాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు వినియోగించుకునేలా చూడాలని సూచించారు.

పీ4 కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇందుకు మంత్రులు, కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

పింఛన్ల కోసమే 75వేల కోట్లు కేటాయించాం

ఇందులో పింఛన్ల కోసమే రూ.75 వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. ప్రజలకు సంక్షేమాన్ని అందించి అక్కడితో వదిలేయకుండా.. వారిని సాధికారత దిశగా ఎలా నడిపించాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అన్ని సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లు, సెర్ప్‌, మెప్మా, పీ4 కార్యక్రమాలను సమీకృతం చేయాలని ఆదేశించారు.

పిల్లలు అంగన్‌వాడీ నుంచి పాఠశాలకు, అక్కడి నుంచి ఉన్నత విద్యకు, ఆ తర్వాత నైపుణ్య శిక్షణ పొందేలా విధానం ఉండాలని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తానికి తగ్గట్టుగా వాటిపై దృష్టి సారించడం లేదని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు

సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్

ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద డబ్బులు జమ చేసిన విషయం కూడా చాలా మందికి తెలియడం లేదని చంద్రబాబు అన్నారు.

అందువల్ల సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్‌ను ప్రకటించాలని ఆదేశించారు. ఏ తేదీన ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

ఎప్పటికప్పుడు సంక్షేమ పండుగలను నిర్వహించాలని తెలిపారు.

కొత్తగా ఒకటో తరగతిలో చేరే పిల్లలకు, పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌లోకి వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక తేదీని నిర్ణయించి 'తల్లికి వందనం' సాయాన్ని విడుదల చేయాలని ఆదేశించారు.

చేనేత ఉత్పత్తులు తయారయ్యే ప్రతి గ్రామాన్ని ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌గా మార్చాలని చంద్రబాబు సూచించారు.

వివరాలు

ప్రహరీలను పూర్తి చేయాలి

కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి నైపుణ్యాలను పెంచాలని, వారి ఉత్పత్తులకు విలువను జోడించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 19 బీసీ బాలికల వసతిగృహాలకు వీబీజీ రాంజీ పథకం కింద ప్రహరీలను వచ్చే సదస్సు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతిగృహాల్లో జరిగినవన్నీ అవకతవకలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అవే నిధులతో విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామని తెలిపారు. అన్ని శాఖలు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.

తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కాపు, బీసీ, ఇతర సామాజికవర్గాలకు చెందిన భవనాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం తొలుత ఆయా కార్పొరేషన్లలో ఉన్న మిగులు నిధులను వినియోగించాలని సూచించారు.

వివరాలు

'మంత్రి బలహీనంగా ఉన్నారు.. కార్యదర్శి బీద అరుపులు అరుస్తున్నారు'

వక్ఫ్‌ ఆస్తులన్నింటినీ పరిరక్షించడంతో పాటు కంప్యూటరైజ్‌ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.

వక్ఫ్‌బోర్డు ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం తక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయాన్ని పెంచకుండా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

'మంత్రి బలహీనంగా ఉన్నారు. కార్యదర్శి బీద అరుపులు అరుస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. అందరూ కలిసి పనిచేసి ఆదాయాన్ని సృష్టించాలని సూచించారు.

సమస్యలను అధిగమించి మైనారిటీలకు న్యాయం చేయాలని ఆదేశించారు.

వివరాలు

కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ 5 కిలోల చొప్పున బియ్యం

రేషన్‌ కార్డుల అప్‌డేషన్‌, అప్‌గ్రేడేషన్‌ను ఏడాదికి రెండుసార్లు మాత్రమే చేసేందుకు అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

కుటుంబ సభ్యుల విభజన చేయకపోయినా కొత్తగా పెళ్లయిన జంటలకు రేషన్‌ కార్డులు అందించాలని ఆయన సూచించారు.

దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. బియ్యం పంపిణీని 25 కిలోలకు పరిమితం చేయకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే వారందరికీ 5 కిలోల చొప్పున బియ్యం అందించాలని ఆదేశించారు.

కుటుంబంలో 10 మందికి మించి ఉంటే.. దానికి అదనంగా మరో కిలో బియ్యం ఇవ్వాలని సూచించారు.

వివరాలు

ఈడబ్ల్యూఎస్‌'లోకి యానాటి కొండ సామాజికవర్గం

శ్రీకాకుళం జిల్లాలోని యానాటి కొండ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఆ సామాజికవర్గాన్ని ఎస్టీలో చేర్చే అంశంపై నిర్ణయం వెలువడే వరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కింద చేర్చి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆదేశించారు.

సమయం వృథా చేయొద్దు

శాఖల వారీగా ప్రజంటేషన్లు ఇచ్చే సమయంలో అధికారులు ఎక్కువ సమయం తీసుకోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమయం వృథా కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సుకు వచ్చే ముందే ఏం చెప్పాలనే దానిపై అధికారులకు పూర్తి స్పష్టత ఉండాలని సూచించారు.

గంటల కొద్దీ ప్రజంటేషన్లు ఇస్తామంటే కుదరదని, అవసరమైతే ముందుగానే రిహార్సల్స్‌ చేసుకుని రావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

ADVERTISEMENT